ఇంగ్లాండ్ గడ్డపై ఇంగ్లాండ్‌ను టెస్ట్ సిరీస్‌లో ఓడించిన న్యూజిలాండ్ జట్టు.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్స్ టేబుల్‌లో దూసుకొచ్చింది. వరుసగా రెండు టెస్టుల్లో విజయం సాధించి పట్టికలో టాప్‌-3లో ప్రవేశించింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. ప్రస్తుత టెస్ట్ ఛాంపియన్ సౌతాఫ్రికా రెండో ప్లేసులో ఉంది. భారత్.. ఐదో ప్లేసులో కొనసాగుతోంది.న్యూజిలాండ్ ఇటీవల టెస్టుల్లో అద్భుత ప్రదర్శన చేస్తోంది. కొన్ని నెలల క్రితం భారత్‌ను సొంతగడ్డపై క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా తొలి టెస్టులో ఓడి 0-1తో వెనకబడ్డప్పటికీ ఆ తర్వాత గొప్పగా పుంజుకుంది. వరుసగా రెండు టెస్టుల్లో గెలిచి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (2025-2027)లో ఆరు మ్యాచ్‌లలో నాలుగో విజయాలతో మూడో ప్లేసులో కొనసాగుతోంది. ఆ జట్టు ఖాతాలో ప్రస్తుతం 52 పాయింట్లు, 72.22 విజయ శాతం ఉంది.మరోవైపు యాషెస్‌లో ఆధిపత్యం, వెస్టిండీస్‌పై క్లీన్‌ స్వీప్‌ తర్వాత ఆస్ట్రేలియా 87.50 విజయ శాతంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు ఆడిన 8 మ్యాచ్‌లలో ఏడింట్లో గెలిచింది. మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ దక్షిణాఫ్రికా 4 మ్యాచ్‌లలో 3 విజయాలతో రెండో ప్లేసులో ఉంది. ఆ జట్టు ఖాతాలో ప్రస్తుతం 75 విజయ శాతం ఉంది. పాకిస్థాన్‌పై సంచలన విజయాల తర్వాత బంగ్లాదేశ్‌ నాలుగో స్థానాన్ని కాపాడుకుంది. ప్రస్తుతం ఆ జట్టు 58.33 విజయశాతాన్ని కలిగి ఉంది.9 మ్యాచ్‌లలో నాలుగు విజయాలు సాధించిన టీమిండియా ఐదో స్థానంలో ఉంది. భారత్ ఖాతాలో 48.15 విజయ శాతం ఉంది. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో శ్రీలంక (44.44 విజయ శాతం), ఇంగ్లాండ్ (24.36 విజయ శాతం), వెస్టిండీస్ (14.81 విజయ శాతం), పాకిస్థాన్ (8.33 విజయ శాతం) ఉన్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ సైకిల్‌లో తమ మ్యాచ్‌లు ముగిసే సరికి టాప్‌-2లో ఉన్న జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.