కేంద్రమంత్రి బండి సంజయ్‌కి బిగ్ రిలీఫ్.. కేసును కొట్టేసిన కోర్టు

Wait 5 sec.

హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో నమోదైన కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమార్‌కు కోర్టు నుంచి భారీ ఊరట లభించింది. ఈ కేసును విచారించిన నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆయనపై నమోదైన కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా అప్పటి అధికార పార్టీ అయిన కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఓటర్లకు ఒక్కో ఓటుకు రూ.25 వేల వరకు డబ్బులు పంపిణీ చేస్తోందని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేయడం తీవ్ర దుమారం రేపింది. అయితే ఓటర్లకు రూ.5 వేలు అందించి.. మిగిలిన మొత్తాన్ని పార్టీ కార్యకర్తలు పంచుకుంటున్నారని కూడా ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. ఈ ఆరోపణల నేపథ్యంలో హుజూరాబాద్ పోలీసులు బండి సంజయ్‌పై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 188, 171సీ, 505(2)తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 123(3ఏ) కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసు నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణకు వచ్చింది. సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసులో సమర్పించిన ఆధారాలను పరిశీలించిన కోర్టు.. ఆరోపణలను బలపరిచే తగిన సాక్ష్యాధారాలు లేవని అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో బండి సంజయ్‌పై నమోదైన కేసును పూర్తిగా కొట్టివేస్తూ తాజాగా తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలోనే తీర్పుతో హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా నమోదైన ఈ కేసులో బండి సంజయ్‌కి పూర్తి ఉపశమనం లభించినట్లు అయింది. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై బండి సంజయ్ చేసిన ఆ వ్యాఖ్యలు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారానికి కారణం అయ్యాయి. ఈ కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో అప్పటి నుంచి విచారణ సాగుతోంది. రెండు వైపులా వాదనలు విన్న జడ్జి.. బండి సంజయ్‌పై చేసిన ఆరోపణలకు సంబంధించి పోలీసులు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. సరైన సాక్ష్యాధారాలను కోర్టు ముందు.. ప్రవేశపెట్టడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని.. ఈ కావడంతో ఈ కేసును కొట్టివేస్తున్నట్లు కోర్టు తేల్చి చెప్పింది.