సీనియర్ నటుడు మాగంటి మురళీ మోహన్‌ గత ఐదు దశాబ్దాలుగా సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ‘జగమే మాయ’ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసిన ఆయన.. ఇప్పటివరకూ 350కి పైగా చిత్రాల్లో నటించారు. నటుడిగానే కాకుండా 'జయభేరి ఆర్ట్స్' అనే బ్యానర్ స్థాపించి, నిర్మాతగానూ రాణించారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 'పద్మశ్రీ' అవార్డును అందజేసింది. ఈ నేపథ్యంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో సన్మానం నిర్వహించింది. ఈ సందర్భంగా మురళీ మోహన్‌ ఆయన తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితంలోని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ''నా జీవితం ఒక తెల్లకాగితం. దానిపై ఎక్కడా ఒక మచ్చ పడలేదు. ఇకపై కూడా పడనివ్వను'' అని అన్నారు. పద్మశ్రీ అవార్డు ఆలస్యంగా వచ్చినప్పటికీ, లేటేస్ట్‌గా వచ్చిందని భావిస్తున్నానన్నారు. ''నేను ముంబై, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో తెలియకపోవచ్చు. ఏది ఏమైనా ఆలస్యంగా వచ్చినా నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. నాకు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపుకు చాలా సంతోషంగా ఉన్నాను'' అని మురళీ మోహన్ అన్నారు. తన అసలు పేరు రాజాబాబు అని, సినిమాల్లోకి వచ్చిన తర్వాత ‘మురళీ మోహన్’గా మారిందని తెలిపారు. ఆ పేరే తనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని, ఇదంతా నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు పెట్టిన బిక్ష అని ఆయన అన్నారు. జీవితంలో తాను నిజాయితీని మాత్రమే నమ్ముకున్నానని, ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ముందుకు సాగానని, తన జీవితాన్ని మలిచిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోనని మురళీ మోహన్ పేర్కొన్నారు. హీరోగా తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత పూర్ణచంద్రరావు, తన సినీ ప్రయాణానికి అండగా నిలిచిన దర్శకుడు దాసరి నారాయణరావు, ఆర్థిక విషయాలపై సలహాలు ఇచ్చిన నటుడు శోభన్ బాబు, అలాగే తన జీవితాన్ని ప్రభావితం చేసిన గుప్త మాణిక్యాలరావులను మురళీ మోహన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆ నలుగురు తనకు చేసిన సహాయాన్ని జీవితంలో మర్చిపోలేనన్నారు.మెగాస్టార్ చిరంజీవితో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని మురళీ మోహన్ గుర్తు చేసుకున్నారు. చిరు పెద్ద హీరో అవుతాడని 'మనవూరి పాండవులు' సినిమా అప్పుడే తాను భావించానని, 'ఇండస్ట్రీకి మొగుడు' అవుతాడని అప్పుడే కృష్ణంరాజుతో అన్నానని తెలిపారు. కెరీర్ ప్రారంభంలో తనని అన్నయ్య అని పిలిచేవాడని, ఇప్పటికీ తనను ప్రేమగా అన్నయ్య అనే పిలుస్తారని మురళీ మోహన్ చెప్పారు. తనకు పద్మశ్రీ అవార్డు ప్రకటించినప్పుడు కూడా ఇంటికి వచ్చి గంట సేపు మాట్లాడి, తనను సత్కరించి వెళ్లారని తెలిపారు. 'చెడు ఉంటే చెవిలో చెప్పండి. మంచి ఉంటే మైకులో చెప్పండి' అని చిరంజీవి ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారని, తాను కూడా ఎప్పుడూ అలా చెడు చెప్పలేదన్నారు మురళీ మోహన్.''చిరంజీవి మొదటి సినిమా 'మనవూరి పాండవులు'లో నాది ధర్మారాజు క్యారక్టర్. చిరంజీవి అర్జునుడు, ప్రసాద్ బాబు భీముడు. అప్పుడు వాళ్లందరూ నన్ను 'అన్నయ్య' అనే పిలిచేవారు. సినిమాలకు వెళ్లినా ఐదుగురం కలిసి వెళ్లేవాళ్లం. ఒక రోజు షూటింగ్ లో చిరంజీవి యాక్టింగ్ చేస్తుంటే కృష్ణంరాజు చూసి.. 'ఈయన పెద్ద యాక్టర్ అవుతాడు. ఆ కళ్లు చూశావా ఎలా ఉన్నాయో. ఎక్స్ప్రెషన్స్ బ్రహ్మాండంగా ఇస్తున్నాడు. మంచి విలన్ అవుతాడు' అని నాతో అన్నారు. దానికి నేను 'విలన్ అవ్వడం ఏంటండి బాబూ.. అతని టాలెంట్ చూస్తే నాకే మతిపోతోంది. ఇండస్ట్రీకి మొగుడు అవుతాడు' అని అన్నాను. నిజంగా ఇదే మాట అన్నాను. అన్నట్టే చిరంజీవి అంత పెద్ద హీరో అయ్యాడు. ఎంత పెద్ద హీరో అయినా ఇవాళ్టికీ తనను ప్రేమగా అన్నయ్య అనే పిలుస్తాడు. నాకు పద్మశ్రీ అవార్డు వచ్చిందని తెలియగానే, ఇంటికి వచ్చి గంటసేపు కూర్చొని సత్కరించి వెళ్లాడు. అలాంటి మనిషి నాతో ఉండటం చాలా సంతోషం'' అని మురళీ మోహన్ అన్నారు. ''నేను యాక్టర్ అవుతానని నామీద నాకే నమ్మకం లేదు. అనుకోకుండానే నటుడ్ని అయ్యాను. ఆ పాత్ర చేయలేకపోయాను.. ఈ పాత్ర చేయలేకపోయాననే అసంతృప్తి నాకు ఎప్పుడూ లేదు. 'ముద్ధబంతి' సినిమాతో నా పేరు మారుమ్రోగిపోతుందని దాసరి గారు అన్నారు. కానీ అందులో నేను చేసిన తాగుబోతు పాత్ర చాలా మందికి నచ్చలేదు. నాగేశ్వరరావుగారి లాగా తాగబోతు క్యారెక్టర్‌ ఎవ్వరూ చేయలేరు. జీవితంలో తాగుబోతు క్యారెక్టర్‌ మాత్రం చేయకూడదని అప్పుడే అనుకున్నాను'' అని మురళీ మోహన్ ఈ సందర్భంగా తెలిపారు. కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదు అంటారని, అలా తాను ఏ సహాయం చేసినా ప్రచారం చేసుకోలేదని చెప్పారు.