పశ్చిమ దేశాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అమెరికాలోని బోస్టన్ నగరంతో పాటు న్యూ ఇంగ్లండ్ ప్రాంతమంతా ఈ వారం తీవ్రమైన హీట్‌వేవ్స్‌ను ఎదుర్కోనుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. శక్తివంతమైన హీట్ డోమ్ ప్రభావంతో ఉష్ణోగ్రతలు 100 డిగ్రీల ఫారెన్ హీట్ అంటే సుమారు 38 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. READ MORE గాలిలో తేమ కారణంగా ఆ ఉష్ణోగ్రతలు మనకు 105 నుంచి 110 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం జూలై 4 వరకు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. అమెరికా నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం బుధవారం నుంచి శనివారం వరకు మసాచుసెట్స్ రాష్ట్రం, న్యూ ఇంగ్లండ్‌లోని చాలా ప్రాంతాలకు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరికలు జారీ చేసింది. కేప్ కాడ్, బెర్క్‌షైర్స్ ప్రాంతాల్లో అంత ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండవని చెప్పింది. నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్పెరిక్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసిన హీట్ రిస్క్ అంచనాల ప్రకారం గ్రేటర్ బోస్టన్ ప్రాంతం గురువారం నాటికి ఎక్స్‌ట్రీమ్ హీట్ రిస్క్ కేటగిరిలో వెళ్లనుంది. బోస్టన్‌లో ఈ హీట్‌వేవ్ కారణంగా గత రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గురువారం ఉష్ణోగ్రతలు 102 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పట వరకు అక్కడ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 98 డిగ్రీల ఫారెన్ హీట్. బోస్టన్ చరిత్రలో అత్యధిక ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారెన్ హీట్.. 1911 జూలై 4న నమోదైంది. జూలై 4 వరకు కొనసాగనున్న ఈ హీట్‌వేవ్స్ ఆ తర్వాత నెమ్మదిస్తాయని.. చల్లని గాలులు ప్రవేశించి, తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమెరికా వాతావరణ శాఖ చెబుతోంది. అయితే అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మధ్యాహ్న సమయంలో ఎక్కువగా బయటకు రాకూడదని సూచించారు. వృద్ధులు, చిన్నారులు, బయట పనిచేసే కార్మికులు తీవ్రమైన వేడి వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.