: మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు లేదా కెనరా బ్యాంకుల్లో అకౌంట్ ఉందా? అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వార్త మిమ్మల్ని కంగారు పెట్టే ఉంటుంది. ఈ 3 ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకులు త్వరలోనే విలీనం కాబోతున్నాయంటూ న్యూస్ క్లిప్పింగ్ వాట్సాప్, ఫేస్‌బుక్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలలో విపరీతంగా షేర్ అవుతోంది. అయితే అసలు ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉంది.. ఖాతాదారులు నిజంగానే అప్రమత్తం కావాలా? కేంద్ర ప్రభుత్వ అధికారిక సంస్థ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తేల్చిన అసలు నిజాల గురించి ఇప్పుడు చూద్దాం. ఎస్బీఐ, పీఎన్‌బీ, కెనరా బ్యాంకులు విలీనం అవుతున్నాయని ప్రచారం జరుగుతుండగా కేంద్ర ప్రభుత్వం దీనిని ఖండించింది. అది ముమ్మాటికీ అబద్ధం అని, ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఒక ప్రముఖ ఛానెల్ న్యూస్ క్లిప్పింగ్ వైరల్ అవగా చాలా మంది నిజమని నమ్మే ప్రమాదం ఉండటంతో స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగమే రంగంలోకి దిగి ఆ న్యూస్ క్లిప్పింగ్ నకిలీది అని స్పష్టం చేసింది. ప్రచారంలో ఉన్న ఫొటో నకిలీది అని, ఏ విశ్వసనీయ వార్తా పత్రిక ప్రచురణ కాదని, లేదా అధికారిక ప్రభుత్వ సమాచారాన్ని ఇది సూచించదు అని పేర్కొంది. విశ్వసనీయ సమాచారం కోసం ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్ తనఖీ చేయాలని వెల్లడించింది. ఏదైనా అనుమానాస్పద కంటెంట్ కనిపిస్తే పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ టీంకు రిపోర్ట్ చేయాలని తెలిపింది. వాట్సాప్, ఇ- మెయిల్ వివరాల్ని కూడా తెలిపింది. వాట్సాప్: + 91 8799711259ఇ- మెయిల్: factcheck@pib.gov.inజనం ఎందుకు నమ్మే అవకాశం ఉందంటే?ఇలాంటి ఫేక్ న్యూస్ త్వరగా జనాల్లోకి చేరేందుకు, ఇంకా జనం నమ్మేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది. కారణం గతంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టడమే. 2020లో ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంకుల్ని పీఎన్‌బీలో విలీనం చేశారు. మరోవైపు కొంత కాలంగా పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్రం సెబీ నిబంధనలకు అనుగుణంగా వాటాల్ని కూడా విక్రయిస్తుండటంతో ఇప్పుడు జనం నమ్మే ప్రమాదం పొంచి ఉంది. ఈ క్రమంలోనే ఎవరో కొందరు ఆకతాయిలు ఇప్పుడు 3 మెగా బ్యాంకుల్ని విలీనం చేస్తున్నారంటూ ఫేక్ స్క్రీన్ షాట్ క్రియేట్ చేశారు. గమనిక: ఇలాంటి అనధికారిక లింక్స్ క్లిక్ చేయొద్దు. బ్యాంకింగ్ వివరాల్ని ఎవరికీ షేర్ చేయొద్దు. మోసపోయే ప్రమాదం ఉంటుంది.