సాధారణంగా ఏ భూమికైనా పంటలు బాగా పండితే డిమాండ్ ఉంటుంది. కానీ.. ఈ భూమికి మాత్రం పంటలతో పని లేదు. ఎలాగైనా ఆ భూమిని కౌలుకు దక్కించుకోవాలని స్థానికులు ఉవ్విలూరుతున్నారు. మాకంటే మాకు కౌలుకు ఇవ్వాలంటూ భూమి యజమాని చుట్టూ పెద్ద సంఖ్యలో రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ భూమిని దక్కించుకుంటే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చుననే ప్రచారం జరగడమే దీనికి ప్రధాన కారణం. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామ పరిధిలో ఉన్న ఒక ఆరెకరాల వ్యవసాయ భూమి ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఆరెకరాల భూమిని పదేళ్ల క్రితం చెన్నారావుపేటకు చెందిన ఒక వ్యక్తి.. కోపాకులపాడు గ్రామానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ భూమిని ఈర్యతండాకు చెందిన ఒక రైతు కౌలుకు తీసుకుని ఏటా పత్తి సాగు చేస్తున్నారు. జూన్ 24న వర్షాలు కురవటంతో పత్తి చేనులో కలుపు తీయించడానికి మహిళా కూలీలను రంగంలోకి దించారు. పొలంలో పని చేస్తుండగా మట్టిలో నుంచి పురాతన కాలం నాటి బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. మొదట ఈ విషయాన్ని దాచాలని చూసినా.. గ్రామంలో ప్రచారం జరగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భూ యజమాని కూలీలను పిలిపించి విచారించగా.. వారు దొరికిన బంగారు వస్తువులను చూపించారు. దీనిపై యజమాని వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఈ దొరకడం ఇదే మొదటిసారి కాదని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో శతాబ్దాల క్రితం కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయాలు ఉండేవని టాక్. గతంలో ఈ పొలంలో దుక్కులు దున్నుతున్న సమయంలో దేవతామూర్తుల విగ్రహాలు కూడా లభించాయట. 1991 లో మొదటిసారిగా అప్పటి భూ యజమానికి వ్యవసాయ పనుల్లో భారీగానే బంగారం దొరికినట్లు గ్రామస్థులు గుర్తు చేసుకుంటున్నారు. కొన్నేళ్ల తర్వాత అదే పొలంలో పాలేరుగా ఉన్న వ్యక్తికి కూడా కొన్ని బంగారు నాణేలు దొరికాయని అంటున్నారు. తాజాగా మహిళా కూలీలకు ఆభరణాలు దొరకడంతో ఈ భూమి బంగారు గని అనే నమ్మకం స్థానికంగా ఊపందుకుంది. బంగారం దొరికిన వ్యవహారం కాస్తా పోలీసుల చెవిన పడటంతో కథ సరికొత్త మలుపు తిరిగింది. గతంలో ఈ భూమిని విక్రయించిన పాత యజమాని కుమారుడు సోమవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ తాతల కాలం నాటి భూమిని.. ఇందులో దొరికిన బంగారాన్ని పంచుకున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఆ నిధిని తమకు అప్పగించి న్యాయం చేయాలని ఆయన కోరారు. మరోవైపు, ఈ పొలంలో బంగారం దొరికిందనే వార్త దావానలంలా వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోపాకులపాడుకు క్యూ కడుతున్నారు. అర్ధరాత్రి సమయాల్లో వందలాది మంది టార్చ్ లైట్లు, గునపాలతో పొలంలో, దాని పరిసర ప్రాంతాలలో సంచరిస్తూ నిధుల కోసం అన్వేషిస్తున్నారు.