నేషనల్ హైవే ప్రశాంతంగా ఉంది.. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు.. ఒక్కసారిగా పెద్ద శబ్దం ఆ వెంటనే చుట్టూ మంటలు.. కళ్లు తెరిచే సరికే అందరూ కాలి బూడిదయ్యారు. ఈ పెను విషాద ఘటన రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో చోటుచేసుకుంది. ఢిల్లీ - ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అధిక వేగంతో వస్తున్న ఓ బస్సు ముందున్న ట్రక్కును ఢీకొనడంతో మంటలు చెలరేగి అక్కడికక్కడే ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 22 మంది గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. 39 మంది ప్రయాణికులతో ఉత్తరాఖండ్‌లోని రుషికేశ్ నుంచి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్తుంది. తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల మధ్య సమయంలో కోల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనావడ సమీపంలోకి రాగానే ముందుగా వెళ్తున్న ట్రక్కును బస్సు బలంగా ఢీకొట్టింది. ఆ వెంటనే అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. బస్సు లోయలోకి పడగానే ఒక్కసారిగా వెనుకవైపు మంటలు చెలరేగాయి. చూస్తుండగానే క్షణాల్లో బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. ట్రక్కుకు కూడా మంటలు వ్యాపించడంతో ఆ ప్రదేశం భయానకంగా మారింది. ప్రయాణికుల ఆర్తనాదాలు విన్నవారు కాపాడే ప్రయత్నం కూడా చేయలేని పరిస్థితి. ఒక్కసారిగా బస్సు లోపల మంటలు వ్యాపించడంతో ఐదుగురు సజీవదహనం కాగా.. మరో ముగ్గురి తలకు తీవ్రగాయాలై చికిత్స పొందుతూ మృతి చెందారు. దాంతో మొత్తం ఏడుగురు ఈ ప్రమాదంలో మృతి చెందగా.. మరో 22 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారు స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న వారు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బస్సు లోయలోకి పడగానే ప్రమాదాన్ని గుర్తించిన కొందరు మంటలు వ్యాపించే లోపే బయటకు దూకి ప్రాణాలు దక్కించుకోగా.. మరికొందర్ని రెస్క్యూ బృందాలు రక్షించాయి. గాయపడిన 22 మంది దౌసా జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను రక్షించేందుకు పోలీసులు గ్రీన్ కారిడార్ కూడా ఏర్పాటు చేశారు. ప్రమాదానికి గురైన బస్సు ఇండోర్‌కు చెందిన హన్స్ ట్రావెల్స్‌‌కు చెందిందిగా పోలీసులు గుర్తించారు. ట్రక్కును ఢీకొనడంతోనే బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే చెబుతామని, విచారణ పూర్తయిన వెంటనే వివరాలు వెల్లడిస్తామని స్థానిక పోలీసులు మీడియాకు వెల్లడించారు.