దేశీయ వాహనదారులకు ఒక క్రేజీ అప్డేట్. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడంతో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరల్ని ఒక్కసారిగా భారీగా తగ్గించింది. తమ నయారా బంకుల్లో లీటరు పెట్రోల్‌పై రూ. 5, అలాగే డీజిల్‌పై రూ. 3 చొప్పున ధరల్ని తగ్గించింది. అయితే ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు ఇప్పటివరకు ధరల తగ్గింపుపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. నయారా ఎనర్జీ పెట్రోల్, తగ్గించడంతో ఇతర ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక దేశీయంగా రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం గత రెండేళ్ల కాలంలో ఇదే తొలిసారి కావడం విశేషం. చివరిగా 2024 పార్లమెంట్ ఎన్నికల వేళ పెట్రోల్, డీజిల్ రేట్లు లీటరుపై రూ. 2 వరకు తగ్గగా తర్వాత చాలా కాలం స్థిరంగానే ఉన్నాయి. ఇటీవల పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో మళ్లీ వరుసగా పెరిగాయి. దీంతో రెండేళ్ల తర్వాత ఇంధన ధరలు తగ్గించిన సంస్థగా నయారా ఎనర్జీ నిలిచింది.