కేబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ డుమ్మా.. యాదగిరిగుట్ట బోర్డు వివాదమే కారణమా!

Wait 5 sec.

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ బోర్డు ఏర్పాటు ప్రక్రియ.. తెలంగాణ ప్రభుత్వంలో భారీ అలజడి సృష్టిస్తోంది. తమను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన ఇష్టం ఉన్న వారిని బోర్డు సభ్యులుగా ఎంపిక చేశారని పలువురు కాంగ్రెస్ నేతల్లో రగులుతోంది. సీనియర్ నేతలను సంప్రదించకుండా, వారికి కనీసం సమాచారం ఇవ్వకుండా యాదగిరిగుట్ట ఆలయ బోర్డును ఏర్పాటు చేశారంటూ.. హస్తం నేతలు గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఈ అంశంపైనే అలిగినట్లు సమాచారం. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. అయితే ఈ మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లిన మంత్రి కొండా సురేఖ.. బుధవారం రోజునే.. తిరిగి తెలంగాణకు చేరుకున్నారు. అయినప్పటికీ గురువారం జరిగిన కేబినెట్ భేటీకి ఆమె దూరంగా ఉండటం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కీలక కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ రాకపోవడంపై సచివాలయ వర్గాలతో పాటు రాజకీయంగానూ రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇందులో ప్రధానంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ బోర్డు ఏర్పాటు వ్యవహారం తెరపైకి వస్తోంది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తనను సంప్రదించకుండానే బోర్డును ఏర్పాటు చేయడం పట్ల మంత్రి కొండా సురేఖ తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తన శాఖలోని అత్యంత ముఖ్యమైన బోర్డు ఏర్పాటు విషయంలో తన అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోలేదనే అసంతృప్తితో మంత్రి కొండా సురేఖ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయంలో ఆమె అలిగారని.. అందుకే కావాలనే నేటి కేబినెట్ సమావేశానికి కొండా సురేఖ దూరంగా ఉన్నారని జోరుగా చర్చ నడుస్తోంది. ఇక యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు సభ్యుల నియామకం విషయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న తనను సంప్రదించకపోవడం పట్ల ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో ఒరిజినల్ నాయకులకు ప్రాధాన్యం తగ్గిపోయిందని.. కొత్తగా వచ్చిన వారి హవానే నడుస్తోందని మండిపడ్డారు. అందుకే తాను నల్గొండలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభకు వెళ్లలేదని స్పష్టం చేశారు.