సూపర్ ఎల్‌ నినో, తీవ్రమైన ఉష్ణోగ్రతలతో నీటి కొరత ఏర్పడుతుందనే భయాల నడుమ నిస్సహాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ ‘అంతర్జాతీయ సదస్సు’ను నిర్వహించింది. సింధు జలాల ఒప్పందాన్ని (IWT) పునరుద్దరించకుంటే ‘కాగితాల మీద ఉన్న ప్రతి ప్రపంచ వ్యవస్థ’ కుప్పకూలుతుందని సదస్సు వేదికగా హెచ్చరించింది. పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్థాన్‌పై ప్రతీకార చర్యలలో భాగంగా భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. 1960 నుంచి ఇరు దేశాల మధ్య సింధు నది, దాని ఉపనదుల జలాల పంపిణీ, వినియోగాన్ని ఈ ఒప్పందం నియంత్రిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో ప్రభావం చూపడంతో వేసవి ఈ ఏడాది మరింత వినాశకరంగా మారే అవకాశం ఉన్నందున, సంభవించే నీటి సంక్షోభం గురించి పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది.పాక్ 'అంతర్జాతీయ సదస్సు'‘’ అనే పేరుతో ఇస్లామాబాద్ వేదికగా జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ మాట్లాడుతూ.. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలన్న భారత నిర్ణయం 'చట్టవిరుద్ధం' అని ఆరోపించారు. నీటిని ఎన్నడూ రాజకీయ సాధనంగా ఉపయోగించకూడదని ఆయన అన్నారు.‘అలాంటి నిబంధన లేని ఒప్పందం కింద ఏ పక్షమూ తన బాధ్యతలను ఏకపక్షంగా నిలిపివేయడం లేదా రద్దు చేయడం తగదు’ అని సింధు జలాల ఒప్పందంపై జరిగిన ఒక సెమినార్‌లో ప్రసంగిస్తూ దార్ పేర్కొన్నారని రేడియో పాకిస్థాన్ నివేదించింది. కేవలం నీటి పంపిణీకి సంబంధించిన ఏర్పాటు మాత్రమే కాదని, అది ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, సహకారానికి ఒక కీలకమైన సాధనం" అని ఆయన వ్యాఖ్యానించారు‘‘పంచుకునే జలాలను ఎన్నడూ ఆయుధంగా వాడుకోకూడదు. అవి ప్రస్తుత, భవిష్యత్ తరాల ప్రయోజనం కోసం సహకారం, సంభాషణ, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవంతో నడిచే దేశాల మధ్య వారధిగా నిలవాలి’’ అని ఇషాక్ దార్ చెప్పడం గమనార్హం. మనిషి గౌరవానికి, ఆహార భద్రతకు, ఆర్థిక అభివృద్ధికి, పర్యావరణ సుస్థిరతకు నీరు అత్యవసరమని అభివర్ణిస్తూ.. అంతర్జాతీయ సరిహద్దులను దాటే నదులు ఘర్షణకు బదులుగా సహకారాన్ని పెంపొందించాలని ఆయన వాదించారు.ఒప్పందం నిలిపివేత ‘యుద్ధ చర్య’భారతదేశం ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ, ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌కు కేటాయించిన జలాలను మళ్లించడానికి, అంతరాయం కలిగించడానికి లేదా తగ్గించడానికి చేసే ఏ ప్రయత్నాన్నైనా "యుద్ధ చర్య"గా పరిగణిస్తామని పాకిస్తాన్ వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు. పాకిస్తాన్‌కు ‘చట్టబద్ధంగా కేటాయించిన’ జలాలను దూరం చేసే ఏ ప్రయత్నానికైనా ప్రాంతీయ శాంతి, భద్రతలపై ‘తీవ్ర పరిణామాలు’ ఉంటాయని దార్ హెచ్చరించారు.ఈ సెమినార్‌లో పాల్గొన్న పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధినేత బిలవల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. సింధు నది చర్చలకు అతీతమైనదని అన్నారు. జలమార్గాలను ఆయుధాలుగా మార్చడానికి వ్యతిరేకంగా ఒక కొత్త అంతర్జాతీయ ఒప్పందాన్ని ఆయన ప్రతిపాదించారు. ‘‘సింధ్‌ను మేము వదులుకుంటామని నమ్మేవారికి పాకిస్థాన్ గురించి తెలియదు. వారికి సింధ్, పంజాబ్, బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, కశ్మీర్ లేదా గిల్గిత్ బల్టిస్థాన్ గురించి, వేల సంవత్సరాలుగా ఈ నదుల ఒడ్డున నివసిస్తున్న ప్రజల గురించి వారికి తెలియదు. మాకు శాంతి కావాలి, కానీ గౌరవప్రదమైన శాంతి కావాలి. మాకు చర్చలు కావాలి, కానీ చట్టబద్ధంగా జరగాలి. మాకు సహజీవనం కావాలి, కానీ లొంగిపోవడం కాదు. కాబట్టి ఈ సదస్సు నుంచి ఈ క్షణం ఒక సందేశం వెళ్లాలి. పాకిస్థాన్ తన నీటిని, తన ప్రజలను, తన ఒప్పందాన్ని, తన సార్వభౌమాధికారాన్ని, తన భవిష్యత్తును కాపాడుకుంటుంది’’ అని ఆయన అన్నారు.దౌత్యపరంగా ఒంటరైన దాయాది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి డొల్ల హెచ్చరికలు జారీ చేస్తూ ‘‘పాకిస్థాన్ నీటి హక్కులను దెబ్బతీసే ఏ ప్రయత్నానికైనా జాతీయ ప్రతిస్పందన ఉంటుంది’’ అని భుట్టో జర్దారీ అన్నారు. ‘తన ప్రజల ప్రాథమిక హక్కుల విషయంలో ఇస్లామాబాద్ రాజీపడదు’ అని ఆయన పేర్కొన్నారు. పాక్ ప్రేరేపిత తీవ్రవాదానికి సంబంధించి భారత ప్రధాన భద్రతా ఆందోళనను పరిష్కరించడంలో విఫలమైన భుట్టో జర్దారీ, ‘నీటిని ఆయుధంగా ఉపయోగించడం అంతర్జాతీయ చట్టానికి విరుద్ధం’ అని వాదించారు.‘‘పాకిస్థాన్ స్పష్టంగా చెప్పాలి సింధు నది ఒక ఒత్తిడి కేంద్రం, బేరసారాల వస్తువు కాదు.. భారత్ చేతిలో పెట్టడానికి ఒక ఆయుధం కాదు. సింధు నది పాకిస్థాన్ జీవనాధారం. ఆ జీవనాధారాన్ని ఉరితాళ్లుగా మార్చే ఏ ప్రయత్నాన్నైనా మన దేశ మనుగడకు ముప్పుగా పరిగణించాలి. ఈ సందేశాన్ని భారతదేశానికి, ప్రపంచానికి అందించాలి. భయాందోళనతోనో, ఉన్మాదంతోనో, నిర్లక్ష్యంతోనో కాదు, కానీ ప్రమాదం ఎంత తీవ్రమైనదో తెలిసిన ప్రజల నిర్మొహమాటంగా స్పష్టతతో అందించాలి’’ అని ఆయన తెలిపారు.ప్రపంచ వ్యవస్థ కూలుతుందా?కాగా, ఈ ఒప్పందం భవిష్యత్తు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ఒప్పందాల విశ్వసనీయతను నిర్ణయిస్తుందని మరో పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్ అన్నారు. ‘‘సింధు జలాల ఒప్పందం ఈ రెండు అణుశక్తుల మధ్య మూడు యుద్ధాలకు సాక్ష్యంగా నిలిచింది. ఈ ఒప్పందం నిలవకపోతే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కాగితాల మీద ఉన్న ఏ ప్రపంచ వ్యవస్థ కూడా సురక్షితంగా ఉండదు.. ఒక చట్టాన్ని పరీక్షించాల్సి వచ్చినప్పుడు, దాని అత్యంత బలహీనమైన చోట పరీక్షించాలి కానీ అత్యంత బలమైన చోట కాదు. ప్రపంచం ఇప్పటివరకు చూసిన ఒప్పందాలలో సింధు జలాల ఒప్పందమే అత్యంత బలమైనది’’ అని మాలిక్ చెప్పడం గమనార్హం.ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి భారత్ ఒప్పందం ఉల్లంఘిస్తోందని పాక్ ఇటీవలి పదేపదే ఆరోపిస్తోంది. మంగళవారం జరిగిన సెమినార్‌లో పాకిస్థాన్ సింధు నదీ వ్యవస్థ అథారిటీ ఛైర్మన్ మెహర్ అలీ షా.. ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇటీవలి నెలల్లో చీనాబ్ నదిలో నీటి ప్రవాహాలను భారత్ తగ్గించిందని ఆరోపించారు.భారత్ స్పందనఈ వ్యాఖ్యలపై భారత్ తక్షణమే స్పందించలేదు. అయితే, ప్రపంచ జల దినోత్సవం 2026 సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఒక కార్యక్రమంలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని మాట్లాడుతూ.. పదేపదే రెచ్చగొట్టే చర్యలు, ద్వైపాక్షిక సంప్రదింపులు విఫలమవడంతో ఈ ఒప్పందాన్ని నిలిపివేయక తప్పలేదని అన్నారు. ఉగ్రవాదానికి మద్దతు విషయంలో పాకిస్థాన్ వైఖరిలో మార్పు రానంత వరకు సింధు జలాల ఒప్పందం నిలివేత కొనసాగుతుందని ఆయన అన్నారు.