ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఫేమస్ బాలాజీ స్వీట్ హౌస్‌లో కొనుగోలు చేసిన ఓ కనిపించిన ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు. ఆ స్వీట్ హౌస్‌పై దాడులు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. షాప్ మొత్తం తనిఖీలు నిర్వహించారు. సరైన నాణ్యత ప్రమాణాలు, పరిశుభ్రత పాటించడం లేదని గుర్తించిన అధికారులు.. ఆ దుకాణంపై అధికారులు ఉక్కుపాదం మోపారు. బాలాజీ స్వీట్ హౌస్‌లో విక్రయించిన మిక్చర్ ప్యాకెట్‌లో బల్లి కనిపించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా.. ఈ ఉదంతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే సిరిసిల్ల జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష ఆధ్వర్యంలో అధికారులు ఆ స్వీట్ హౌస్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఈ తనిఖీల్లో భాగంగా.. అక్కడ రూల్స్‌ను భిన్నంగా.. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆ స్వీ్ట్ హౌస్‌లో నిల్వ ఉంచిన నాణ్యత లేని, కాలం చెల్లిపోయిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని వెంటనే మున్సిపాలిటీ చెత్త వాహనంలో తీసుకెళ్లి ధ్వంసం చేశారు.ఈ క్రమంలోనే వ్యాపారులు.. అధిక లాభాల కోసం.. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యంతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రూల్స్ ఉల్లంఘించినందుకు గానూ బాలాజీ స్వీట్ హౌస్ యాజమాన్యానికి రూ.1 లక్ష జరిమానా విధిస్తూ.. మున్సిపల్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ రూల్స్ ప్రకారం స్వీట్ తయారీ కేంద్రంతో పాటు విక్రయ దుకాణాన్ని కూడా పూర్తిగా సీజ్ చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష వెల్లడించారు.ఇక మిక్చర్ ప్యాకెట్‌లో బల్లి కనిపించినట్లు సమాచారం అందుకున్న సిరిసిల్ల టౌన్ పోలీసులు.. ఆ దుకాణాన్ని తనిఖీ చేసి ప్రాథమిక విచారణ చేపట్టారు. సిరిసిల్లకు చెందిన గొడుగు అరుణ్ చంద్ అనే వ్యక్తి.. మంగళవారం సాయంత్రం ఆ బాలాజీ స్వీట్ హౌస్‌లో మిక్చర్ ప్యాకెట్ కొన్నాడు. అయితే దాన్ని ఇంటికి వెళ్లి ఓపెన్ చేసి చూడగా అందులో చనిపోయిన బల్లి కనిపించింది. ఈ క్రమంలోనే ఆ విషయం చెప్పేందుకు తిరిగి బాలాజీ స్వీట్ హౌస్‌కు వెళ్లగా వారు తనతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని.. తనను బెదిరించారని ఆరోపిస్తూ సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్‌లో అరుణ్ చంద్ ఫిర్యాదు చేశాడు.