తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. దళపతి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) సర్కారును కూల్చేందుకు చేసిన కుట్రను తమిళనాడు నిఘా, పోలీస్ యంత్రాంగం భగ్నం చేసింది. టీవీకేకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించి, వారిని ప్రలోభపెట్టిన ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఉన్నతాధికారితో పాటు ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 15 మంది టీవీకే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడానికి కుట్ర జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. టీవీకే ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేపట్టి ఓ కన్సల్టెన్సీ సంస్థ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి సంబంధాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. చెన్నైలో ఒకర్ని అరెస్టు చేయగా, మిగతా ఇద్దరిని కరూర్‌‌లో అదుపులోకి తీసుకున్నారు. కుట్ర, దాని విస్తృత నెట్‌వర్క్‌పై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.ఉత్తంగరై టీవీకే ఎమ్మెల్యే ఎన్ ఎలయరాజా చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. టీవీకే నేత, తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌పై అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా కన్సల్టెన్సీ సంస్థ ఐపీడీఎస్‌కు చెందిన ఓ వ్యక్తి తనకు రూ.35 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. తర్వాత తనను బెదిరించారని, దీనిపై ఎవరితోనూ చర్చించవద్దని చెప్పారని ఎమ్మెల్యే ఆరోపించారు. అరెస్టైన ముగ్గురిలో ఒకరు సెంథిల్ బాలాజీ, అతడి సోదరుడు అశోక్‌‌కు సన్నిహితుడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.ఈ పరిణామానికి ముందు డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మాట్లాడుతూ.. ‘‘త్వరలోనే టీవీకే ప్రభుత్వం కూలిపోతుందని, తమిళనాడులో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయం’’ అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డీఎంకే వ్యూహాత్మకంగానే విజయ్ ప్రభుత్వంపై కుట్రకు తెరలేపిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.