ఐపీఎల్ 2026 ముగిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా చర్చనీయాంశంగా మారిపోయాడు. మూడేళ్ల క్రితం ముంబై ఇండియన్స్‌లోకి కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చిన అతడు.. ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాడు. ఈ మూడు సీజన్లలో ముంబై రెండు సార్లు లీగ్ స్టేజ్‌కే పరిమితమైంది. దానికి తోడు జట్టులో అతడు ఒంటరి అయ్యాడని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా వచ్చే ఇటీవల ఈ వార్తలు మరింత పెరిగాయి. ట్రేడ్ విండోలో అతడిని దక్కించుకునేందుకు ఫ్రాంఛైజీలు పోటీ పడుతున్నాయని సమాచారం. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ సైతం అతడి కోసం ప్రయత్నిస్తోందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించారు. హార్దిక్ పాండ్యాను ట్రేడ్ ద్వారా జట్టులోకి తీసుకురావడంపై ఇప్పటివరకు చర్చలు జరగలేదని స్పష్టం చేశారు.“హార్దిక్ పాండ్యా ట్రేడ్ విషయంపై ఇప్పటివరకు మా ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్‌లో ఎలాంటి చర్చ జరగలేదు. ఐపీఎల్ 2026పై రివ్యూ మీటింగ్ జరిగిన తర్వాతే.. ట్రేడ్‌లపై నిర్ణయాలు తీసుకుంటాం. మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) ముగిసిన తర్వాత ఐపీఎల్ 2026పై రివ్యూ ఉంటుంది” అని కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్‌లో హార్దిక్ పాండ్యా వెళ్లడం దాదాపుగా ఖరారైందని వార్తలకు చెక్ పడినట్లయింది.ఇక మేజర్ లీగ్ క్రికెట్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. జులై 18 వరకు ఈ లీగ్ జరగనుంది. ఇందులో సీఎస్‌కే అనుబంధ జట్టైన టెక్సాస్ సూపర్ కింగ్స్ కూడా పాల్గొంటోంది. అందుకే ఎంఎల్‌సీ ముగిసిన తర్వాతే ఐపీఎల్ 2027 సీజన్‌పై పూర్తి సమీక్ష నిర్వహించి, ట్రేడ్‌లపై నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎస్‌కే యాజమాన్యం స్పష్టం చేసింది. మరోవైపు హార్దిక్ పాండ్యా కోసం ఏడు ఫ్రాంఛైజీలు పోటీ పడుతున్నట్లు సమాచారం. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మినహా.. మిగతా ఫ్రాంఛైజీలు అతడిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయట!