హైదరాబాద్ నగరంలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను గుర్తించి.. అక్కడ ఏర్పాటు చేసిన నిర్మాణాలను తొలగిస్తున్న హైడ్రాపై ఎన్ని ప్రశంసలు వస్తున్నాయో.. అంతకంటే ఎక్కువగా విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ప్రతాపం కేవలం పేదలపైనే అని.. బడా వ్యాపారులు, రాజకీయ నేతలు, పలుకుబడి ఉన్న వ్యక్తులను చూసీచూడనట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు ఇప్పటికే వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో కొన్ని చోట్ల హైడ్రా అధికారుల దూకుడుపై తెలంగాణ హైకోర్టును కొందరు బాధితులు ఆశ్రయించగా.. అలాంటి పిటిషన్లపై విచారణ జరిపి.. హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. హైదరాబాద్ తార్నాకలోని ఎర్రకుంట అక్రమాలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. హైడ్రా తీరుపై మరోసారి అసహనం వ్యక్తం చేసింది. ఎర్రకుంట ఆక్రమణలపై దాఖలైన పిటిషన్‌పై వాదనల సందర్భంగా.. 8 ఎకరాల ఎర్రకుంట చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుని ఆక్రమణకు గురైందని పిటిషనర్‌ తరఫు లాయర్ విజయ్‌ గోపాల్‌.. హైకోర్టుకు తెలిపారు. అయితే ఈ ఆక్రమణ గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ), హైడ్రా, లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీకి కూడా ఫిర్యాదు చేశామని కానీ.. వారు పట్టించుకోలేదని.. ఎలాంటి చర్యలు చేపట్టలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ క్రమంలోనే ఆయా విభాగాల అధికారులపై తాజాగా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులు కేవలం పేదల ఇళ్లనే కూలుస్తున్నాయని ఈ సందర్భంగా ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.