ఫ్రీగా బ్యాంకాక్ టూర్, రూ.25 వేలు, ఫైవ్‌స్టార్ హోటల్‌లో వసతి.. యూత్‌కు ఎర

Wait 5 sec.

తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల సరఫరా, కొనుగోళ్లు, అమ్మకాలపై ఉక్కుపాదం మోపేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నార్కొటిక్స్ బ్యూరోకు సంబంధించి స్పెషల్ ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే మత్తు పదార్థాలు విక్రయించే ముఠా ఆట కట్టిస్తున్న ఈగల్ ఫోర్స్.. భారీ ఆపరేషన్లు చేపట్టి.. గంజాయి పార్టీలు, రవాణాను అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర సంస్థలతో కలిసి మరో అంతర్జాతీయ గంజాయి ముఠాను పట్టుకుంది. అయితే విదేశాల్లో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి.. ఇక్కడి నుంచి యువతీయువకులను అక్కడికి పంపించి.. వారి ద్వారా ఈ సరుకును తీసుకువస్తున్నట్లు తేలింది. ఇందుకోసం యువత, సినిమా అవకాశాల కోసం ఎదురుచూసే జూనియర్ ఆర్టిస్ట్‌లకు ఈ ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠా ఎర వేస్తోంది. లగ్జరీ లైఫ్ స్టైల్ చూపిస్తూ.. వారిని గంజాయి సరఫరాదారులుగా మారుస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ విచారణలో తేలింది. ఇక్కడి నుంచి యువతీ యువకులను ఉచితంగా బ్యాంకాక్‌కు పంపించి.. అక్కడి నుంచి పార్సిళ్లు తీసుకువచ్చేందుకు డబ్బులు ఇస్తున్నారు. ఫ్రీగా బ్యాంకాక్ ట్రిప్, ఫైవ్ స్టార్ హోటల్‌ వసతి, పైగా డబ్బులు రావడంతో.. కష్టపడి పనిచేయకుండానే డబ్బులు వస్తున్నాయని యువత ఇలాంటి చెడు మార్గాల్లోకి వెళ్తున్నారని తెలుస్తోంది. బ్యాంకాక్ నుంచి పార్సిల్ తీసుకువచ్చిన వారికి వీటికి అదనంగా రూ.25 వేలు కూడా ఇస్తూ.. ఈజీ మనీకి యువతను డ్రగ్స్ ముఠాలు అలవాటు చేస్తున్నారు. సాధారణంగా బ్యాంకాక్ మార్కెట్లో రూ. 3 లక్షలకు కిలో ఉండే హైడ్రోపోనిక్ గంజాయి (ఓజీ).. మన దేశంలో దాదాపు రూ.80 లక్షల నుంచి రూ. కోటి వరకు విక్రయిస్తున్నారు. ఇందుకోసం డ్రగ్స్ స్మగ్లర్లు.. అమాయకులను తమ చట్టవ్యతిరేకమైన పనులకు వాడుకుంటున్నారు. ముంబైకి చెందిన హేమంగ్ ప్రమోద్ కేలుస్కర్ అనే కీలక నిందితుడు ఈ భారీ ఇంటర్నేషనల్ డ్రగ్స్ నెట్‌వర్క్‌కు మాస్టర్ మైండ్ అని గుర్తించారు. దేశవ్యాప్తంగా ఏకంగా 300 మంది యువతీ యువకులు.. ఈ హేమంగ్ ప్రమోద్ కేలుస్కర్ కింద పనిచేస్తూ.. ఈ గంజాయి దందా సాగిస్తున్నారని తేల్చారు. అంటే ఈ గంజాయి మాఫియా నెట్‌వర్క్ దేశంలో ఎంత విస్తరించిందో అర్థం అవుతోంది. విదేశాల నుంచి గంజాయి తీసుకొచ్చే ఆపరేషన్ సక్సెస్ అయితే తక్కువ ఖర్చుతో సరుకు వస్తుంది. దాన్ని విక్రయించి రూ.కోట్లు సంపాదించవచ్చని.. ఒకవేళ వారు పట్టుబడితే వారే కేసులు, జైళ్లకు బలి అవుతారని కేలుస్కర్ ముఠా మాస్టర్ ప్లాన్ వేసినట్లు ఈగల్ ఫోర్స్ అనుమానిస్తోంది.ఇక ఉత్తర్‌‍ప్రదేశ్‌కు చెందిన తివారీ అనే యువకుడు ఏకంగా 101 సార్లు బ్యాంకాక్‌కు వెళ్లి వచ్చాడని అధికారులు గుర్తించారు. ఇక ఈ ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠాలో తెలంగాణ యువత కూడా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ నుంచే 14 మంది యువకులు ఈ గంజాయి ట్రాప్‌లో చిక్కుకోగా.. వారి కదలికలపై తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు పక్కా నిఘా పెట్టి.. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ హైడ్రోపోనిక్ గంజాయి వాడకాన్ని కట్టడి చేసేందుకు ‘ఆపరేషన్ వీడ్ అవుట్’ పేరుతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) రంగంలోకి దిగింది. గత 20 రోజుల్లో ముంబై, జైపూర్, లక్నో, కోల్‌కతా వంటి నగరాల్లో ఒకేసారి దాడులు చేసి క్వింటాల్‌కు పైగా గంజాయిని సీజ్ చేసింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కస్టమ్స్ అధికారులు ఏకంగా రూ.700 కోట్ల విలువైన 1005 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని పట్టుకున్నారు. ఈ లెక్కలు చూస్తుంటేనే ఈ గంజాయి స్మగ్లింగ్ దేశంలో ఏ స్థాయిలో వేళ్లూనుకుని పోయిందో అర్థం అవుతోంది.లగ్జరీ లైఫ్, ఫారిన్ టూర్లు అని ఈ ఉచ్చులో చిక్కుకుని.. ఇలాంటి నేరాలకు పాల్పడితే జీవితాంతం జైల్లోనే ఉండక తప్పదని తెలంగాణ తీవ్ర హెచ్చరికలు చేశారు. తరచూ విదేశాలకు వెళ్లేవారి డేటా, అనుమానాస్పద కదలికలపై నిఘా పెట్టిన ఈగల్ ఫోర్స్.. కస్టమ్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్సీబీతో కలిసి 2 నెలల పాటు పక్కా స్కెచ్ వేసి మరీ ఈ అంతర్జాతీయ ముఠా గుట్టును పసిగట్టి.. కేలుస్కర్ ఆట కట్టించాయి. ఈజీ మనీ పేరుతో ఫ్రీగా ఇంటర్నేషనల్ టూర్స్ ఆఫర్ చేసే ముఠాలతో అలర్ట్‌గా ఉండాలని సందీప్ శాండిల్య స్పష్టం చేశారు.