ఇకపై తమిళనాడు ప్రభుత్వం కొనుగోలు చేసే కొత్త బస్సులన్నీ ఎయిర్‌ కండిషనింగ్‌ సౌకర్యంతోనే ఉండనున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తమిళనాడు రోడ్డు రవాణా శాఖ మంత్రి విజయ్‌ తమిళన్‌ పార్థిబన్‌ వెల్లడించారు. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేలా ప్రజా రవాణా వ్యవస్థను ఆధునికీకరించడంపై టీవీకే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి పార్థీబన్‌ తెలిపారు. తమిళనాడులోని ప్రతి మారుమూల గ్రామానికి కూడా బస్సు సౌకర్యం చేరాలన్నది తమ సీఎం లక్ష్యమని ఆయన చెప్పారు. కొత్తగా కొనే ప్రతి బస్సులోనూ ప్రయాణికులకు అవసరమైన సదుపాయాలు ఉండాలని, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించే అవకాశం కల్పించాలని సీఎం సూచించినట్లు మంత్రి పార్థిబన్ వెల్లడించారు. ‘‘తమిళనాడు ప్రజలు ఏసీ బస్సుల్లో సౌకర్యవంతంగా ప్రయాణించాలని మా ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు’’ అని రాష్ట్రంలోని వేడి, తేమతో కూడిన వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్థిబన్ పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే పథకాన్ని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని మంత్రి విలేకరులతో అన్నారు. ఈ విషయమై ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించారని చెప్పారు. ‘త్వరలోనే ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేస్తారు’’ అని మంత్రి తెలిపారు.ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ ప్రభుత్వ బస్సులో ప్రయాణించిన సంగతి తెలిసిందే. గతవారం మొత్తం 127.21 కోట్ల వ్యయంతో కొనుగోలుచేసిన 300 కొత్త ప్రభుత్వ బస్సులను సీఎం ప్రారంభించారు. ఇందులో 164 డీజిల్‌ బస్సులు కాగా.., 136 బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిన సీఎన్జీ బస్సులు ఉన్నాయి. రవాణా అనుసంధానాన్ని మెరుగుపరచడానికి, ప్రయాణికుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడానికి, కోయంబేడు, కిళంబాక్కం వంటి కీలక ప్రాంతాల్లో కొత్త బస్సులను మోహరించారు. తమిళనాడులోని ప్రస్తుత ప్రజా రవాణా వ్యవస్థ, సౌకర్యాలను ఆధునీకరించడం, అలాగే రాష్ట్రవ్యాప్తంగా రవాణా సౌకర్యాల అనుసంధానాన్ని మెరుగుపరచడం టీవీకే ప్రభుత్వం లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే కొత్త బస్సుల్లో ఏసీ సదుపాయాలు ఉండాలని సీఎం భావిస్తున్నట్టు తెలిపారు.