‌వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో భారతీయ ఫ్యామిలీ వీరంగం సృష్టించింది. హో చి మిన్ సిటీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన డిస్ట్రిక్ట్ 1లో ఉన్న ‘బాంబే బైట్స్ హెచ్‌సీఎమ్’ అనే భారతీయ రెస్టారెంట్‌లో ఆస్తిని ధ్వంసం చేయడమే కాకుండా, సిబ్బందిని బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి. డైనింగ్ ఏరియాలో వస్తువులను పిల్లలు ఇష్టమొచ్చినట్లు విసిరేస్తుంటే ఫ్యామిలీని సిబ్బంది వారించమన్నందుకు ఈ గొడవ జరిగినట్లు సమాచారం. డైనింగ్ ఏరియాలో టిష్యూలను చిందరవందరగా విసిరేస్తుంటే, అలా చేయొద్దని సిబ్బంది సౌమ్యంగా చెప్పడంతో పరిస్థితి ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చిందని రెస్టారెంట్ యాజమాన్యం తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వివరాలను వెల్లడించింది.రెస్టారెంట్ యాజమాన్యం వెల్లడించిన వివరాల ప్రకారం.. సిబ్బంది చెప్పిన మాటలకు సహకరించాల్సింది పోయి, ఆ కుటుంబం ఎదురుదాడికి దిగింది. తాము సోషల్ మీడియా 'ఇన్‌ఫ్లుయెన్సర్స్' అని చెప్పుకుంటూ బాధ్యతారహిత్యంగా వ్యవహరించడమే కాకుండా, హోటల్‌లో ఫర్నిచర్ ధ్వంసం చేసి, సిబ్బందిని బూతులు తిట్టారని రెస్టారెంట్ యజమాని ఐశ్వర్య ఖన్నా సింగ్ ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలను తాము భద్రపరిచినట్లు యాజమాన్యం పేర్కొంది.‘‘ఒక విషయాన్ని మేము చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం.. రెస్టారెంట్ అనేది ఆటస్థలం కాదు... మా సిబ్బంది ఎవరి కోపానికో, అహంకారానికో బలి కావడానికి ఇక్కడ లేరు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన ప్రాథమిక మర్యాదలు పాటించాల్సిన అవసరం లేదనుకుంటే కుదరదు. పౌరసత్వ స్పృహ అంటే పిల్లలకు జవాబుదారీతనాన్ని నేర్పించడం, ప్రభుత్వ/ప్రైవేట్ ఆస్తులను గౌరవించడం.. అందరూ సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేందుకే నియమాలు ఉన్నాయని అర్థం చేసుకోవడం. ఈ విలువలను విస్మరించినప్పుడు, అది కార్మికులను, ఇతర పక్షాలను, మొత్తం వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుంది’’ అని సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.అన్ని వర్గాల ప్రజలను తమ రెస్టారెంట్‌కు ఆహ్వానిస్తామని, అయితే ప్రతి ఒక్కరి నుంచి గౌరవప్రదమైన ప్రవర్తనను ఆశిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. ఆస్తి నష్టం, క్రమశిక్షణా రాహిత్యం, సిబ్బందిని బెదిరించడం వంటి చర్యలను ఎంతమాత్రం సహించేది లేదని తేల్చి చెప్పింది. ‘ఆతిథ్యం ఇవ్వడం మా బాధ్యత. కానీ ప్రాథమిక మర్యాద పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత’’ అని వారి ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. పర్యాటకుల ప్రవర్తన, బహిరంగ ప్రదేశాలలో తల్లిదండ్రుల బాధ్యత, హోటల్ సిబ్బంది పట్ల ప్రవర్తించే తీరుపై నెటిజన్లు చర్చిస్తున్నారు.‘‘చాలా అసహ్యకరమైన ప్రవర్తన.. ఒక వ్యాపార సంస్థ యజమానిగా నేనైతే దీనిపై ఖచ్చితంగా విచారణ జరిపిస్తాను. వారు వెయిటర్‌ను భౌతికంగా నెట్టేసారు, వియత్నాం క్రిమినల్ కోడ్ ఏం చెబుతుందో నాకు తెలియదు కానీ, భారతదేశంలో అయితే ఇది దాడి కింద శిక్షార్హమైన నేరం. పైగా ఎలాంటి కారణం లేకుండా ఆస్తిని ధ్వంసం చేయడం తప్పు.’’ అని ఒకరు.. ‘‘వెంటనే పోలీసులను పిలిచి వారిని అప్పగించాల్సింది’’ అని మరొకరు కామెంట్ చేశారు. ‘‘పిల్లలకు మంచి ప్రవర్తనను నేర్పించడం తల్లిదండ్రుల మొదటి కర్తవ్యం.. జీవితం వారికి కఠినంగా నేర్పకముందే, చిన్నప్పుడే ఆ పని చేయాలి’’ అని ఇంకొకరు అన్నారు.అయితే, ఈ ఘటనపై సదరు భారతీయ కుటుంబం ఇంకా స్పందించలేదు. అలాగే రెస్టారెంట్ చేసిన ఆరోపణలు కూడా ఇంకా స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.