ఏపీలో తెలంగాణ దొంగల ముఠాలు.. పట్టపగలే చోరీలు, తస్మాత్ జాగ్రత్త!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా గోదావరి జిల్లాలపై దొంగల కన్ను పడింది. మొన్నటిదాకా ధార్ గ్యాంగ్ భారీ చోరీలకు పాల్పడి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోగా.. ఇప్పుడు తెలంగాణ దొంగల ముఠాలు తమ చేతులకు పనిపెట్టాయి. ఒకదాని తర్వాత మరో ఘటన జరుగుతుండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ పట్టపగలే దొంగతనాలు చేస్తుండటంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. పోలీసులు మాత్రం గస్తీ ముమ్మరం చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు గాంధీనగర్‌లో నాలుగు రోజుల కిందట మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు చోరీ జరిగింది. ఉదయం 11:30 గంటలకు ఇంటికి తాళాలేసి వెళ్లిన యజమాని.. మధ్యాహ్నం ఒంటిగంటకు ఇంటికి వచ్చేసరికి మెయిన్ డోర్ తాళాలు పగలగొట్టి ఉన్నాయి. హడావుడిగా లోపలికి వెళ్లి చూసేసరికి మొత్తం 50 కాసుల బంగారు ఆభరణాలు, రూ. 10 వేల నగదు అపహరించుకుని వెళ్లారు. READ ALSO జిల్లా కేంద్రమైన ఏలూరులో ఏకంగా న్యాయవాది ఇంట్లోనే చోరీ చేశారు. పది రోజుల కిందట సత్రంపాడు ప్రభుత్వ ఐటీఐ సమీపంలో ఉంటున్న న్యాయవాది తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికెళ్లారు. సాయంత్రం 5:30 గంటలకు తిరిగొచ్చేసరికి దొంగలు బీభత్సం సృష్టించారు. బీరువాలోని మూడు కాసుల బంగారు నగలు, 20 తులాల వెండి పట్టీలు ఎత్తుకెళ్లారు. అయితే, ఇదంతా తెలంగాణకు చెందిన కొన్ని దొంగల ముఠాల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణ దొంగల ముఠాలు జిల్లాలో సంచరిస్తున్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. అంతర్ జిల్లాల దొంగల ముఠాలు, స్థానిక నేరస్థులపై నిఘా పెట్టామని.. ఇటీవల చోరీ కేసుల్లో అరెస్టయి విడుదలైన దొంగల వివరాలు కూడా తెలుసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా తడికలపూడి, నూజివీడు, కైకలూరు, జంగారెడ్డిగూడెం ప్రాంతాల ప్రజలను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. అనుమానంగా ఎవరైనా వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలంటూ చెబుతున్నారు. గతంతో పోలీస్తే జిల్లాలో చోరీలు తగ్గించామని, రాత్రిళ్లు ఎక్కువ నిఘా పెట్టామని ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ తెలిపారు.