చైనా ఇటీవల న్యూక్లియర్ సబ్‌మెరైన్ నుంచి లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌ను పరీక్షించింది. డమ్మీ వార్ హెడ్‌తో ఈ క్షిపణి ప్రయోగం చేపట్టినట్లు చైనాకు చెందిన జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. కేవలం భూమి మీది నుంచి మాత్రమే కాకుండా.. సముద్ర గర్భం నుంచి సైతం భూమ్మీద ఎక్కడైనా అణు దాడి చేయగల సామర్థ్యం తనకు ఉందని ఈ క్షిపణి ప్రయోగం ద్వారా చైనా ప్రపంచానికి చాటింది. దీంతో పసిఫిక్ మహాసముద్ర జలాల్లోకి చైనా చేపట్టిన అరుదైన ఈ ప్రయోగం అమెరికాతోపాటు దాని మిత్ర దేశాలను కలవరానికి గురి చేసింది. చైనా చివరగా రెండేళ్ల క్రితం పసిఫిక్ జలాల్లో ఓ డమ్మీ వార్ హెడ్‌తో మిస్సైల్ టెస్ట్ చేపట్టింది. 1980 తర్వాత చైనా పసిఫిక్ జలాల్లో క్షిపణి ప్రయోగం చేపట్టడం అదే తొలిసారి.జులై 6న స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.01 గంటలకు చైనా నేవీ ఈ లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌ను పసిఫిక్ మహా సముద్రంలోని అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి పరీక్షించింది. ఈ క్షిపణి తన ప్రయాణాన్ని పూర్తి చేసిన తర్వాత దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని నిర్దేశిత ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని చైనా ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ జిన్హువా రిపోర్టు పేర్కొంది. చైనా సైన్యం వార్షిక శిక్షణలో భాగంగా ముందే నిర్ణయించిన ప్రకారం ఈ క్షిపణిని ప్రయోగించిందని.. ఇది ఏ దేశాన్ని లేదా సైనిక లక్ష్యాన్ని ఉద్దేశించి చేపట్టిన ప్రయోగం కాదని చైనా స్పష్టం చేసింది.అమెరికాను తాకే సామర్థ్యం..చైనా దగ్గర ఉన్న అత్యాధునిక క్షిపణి అయిన జేఎల్-3 సబ్‌మెరైన్ లాంచ్‌డ్ బాలిస్టిక్ మిస్సైల్‌ను ఈ క్షిపణి ప్రయోగంలో వాడి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది నిర్వహించిన మిలటరీ పరేడ్‌లో తొలిసారి ఈ క్షిపణిని డ్రాగన్ ప్రదర్శనకు ఉంచింది. చైనా తీరంలోని సముద్ర జలాల నుంచి ప్రయోగించినా సరే అమెరికాను తాకే సామర్థ్యం ఈ ఖండాతర క్షిపణికి ఉంది. దీంతో చైనా చేపట్టిన ఈ క్షిపణి పరీక్ష పట్ల అమెరికాతోపాటు దాని మిత్ర దేశాలైన తైవాన్, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ప్రశాంతమైన ప్రాంతంలో చైనా అలజడి..!చైనా క్షిపణి పడిన ప్రాంతం 1985 నాటి రారాటోంగా ఒప్పందం ప్రకారం ఏర్పాటైన దక్షిణ పసిఫిక్ అణు రహిత ప్రాంతంలో ఉంది. ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతం చైనా చర్యల వల్ల భవిష్యత్తులో సైనిక పోటీకి వేదిక అవుతుందేమోనని అమెరికా మిత్ర దేశాలు భయపడుతున్నాయి. అంతర్జాతీయ సమాజానికి చైనా ఇస్తున్న హెచ్చరికగా క్షిపణి పరీక్షను ఆ దేశాలు అభివర్ణించాయి.చైనా చేపట్టిన ఈ క్షిపణి ప్రయోగాన్ని నిశితంగా గమనించినట్లు అమెరికా పేర్కొంది. ఆయుధ నియంత్రణపై అర్థవంతమైన చర్చల్లో పాల్గొనాల్సిందిగా తాము చైనాను కోరుతూనే ఉన్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగోట్ తెలిపారు. చైనా వ్యూహాత్మక సైనిక సామర్థ్యాలను ఎంత వేగంగా పెంచుకుంటుంది అనడానికి ఈ క్షిపణి ప్రయోగం నిదర్శనమని అమెరికా అధికారులు రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.జలాంతర్గాముల నుంచి క్షిపణి ప్రయోగంతో అడ్వాంటేజ్..ఒక క్షిపణిని భూమి మీద నుంచి ప్రయోగించడంతో పోలిస్తే జలాంతర్గాముల నుంచి ప్రయోగించడం అనేది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే భూమి మీద ఎక్కడి నుంచి క్షిపణులను ప్రయోగిస్తారనే విషయమై నిఘా ద్వారా ఒక అంచనాకు రావచ్చు. కానీ సబ్‌మెరైన్లు నిరంతరం సముద్ర జలాల్లో కదులుతుంటాయి. అణుశక్తితో పని చేసే జలాంతర్గాములు అయితే చాలా కాలంపాటు సముద్ర గర్భంలోనే ఉంటూ గస్తీ నిర్వహించగలవు.మరోవైపు చైనా ఎప్పటికప్పుడు తన దగ్గరున్న అణ్వాయుధాలను పెంచుకుంటోంది. 2025లో అమెరికా కాంగ్రెస్‌కు పెంటగాన్ రిలీజ్ చేసిన రిపోర్టు ప్రకారం చైనా దగ్గర సుమారు 600 అణ్వస్త్రాలు ఉన్నాయి. 2030 నాటికి చైనా దగ్గర 1000కిపైగా అణ్వస్త్రాలు ఉండనున్నాయని అంచనా.చైనా ‘టైమింగ్’..ఆస్ట్రేలియా, ఫిజి దేశాలు ‘ఓషన్ ఆఫ్ పీస్’ ఒప్పందంపై సంతకాలు చేసిన సమయంలో.. అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే చైనా ఈ క్షిపణి ప్రయోగం చేపట్టడం గమనార్హం. ఆస్ట్రేలియా, ఫిజి మధ్య కుదిరిన కొత్త రక్షణ ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాల్లో ఏ దేశంపైనా అయినా దాడి జరిగితే.. ఒకరికొకరు సాయం చేసుకోవడానికి ఈ రెండు దేశాలు కట్టుబడి ఉంటాయి. పసిఫిక్ ప్రాంతంలో రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఆస్ట్రేలియా చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ఒప్పందం ఒక భాగం. సాలమాన్ దీవులతోనూ ఆస్ట్రేలియా సమగ్ర ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది.సాధారణంగా ఇలాంటి వ్యూహాత్మక క్షిపణి ప్రయోగాలను నెలలు లేదా సంవత్సరాల ముందే ప్లాన్ చేస్తారు. కానీ చైనా మాత్రం క్షిపణి ప్రయోగానికి కొద్ది సమయం ముందే దీని గురించి ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్ దేశాలకు సమాచారం ఇచ్చింది. చైనా చేపట్టిన ఈ క్షిపణి ప్రయోగం రెచ్చగొట్టే చర్య అని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ అభిప్రాయపడ్డారు.