క్యాచ్ పట్టకముందే మైదానం వీడిన సూర్యవంశీ.. వీడియో వైరల్!

Wait 5 sec.

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా యంగ్ ఓపెనర్ ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అతడు ఔట్ అయిన తర్వాత అతడు ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. క్యాచ్ కూడా పూర్తి కాకుండానే అతడు పెవిలియన్ వైపు అడుగులు వేయడం ఇందులో కనిపించింది.బ్రిస్టల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే ఇంగ్లాండ్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి అతడు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలోనే ఆర్చర్ వేసిన ఒక షార్ట్ పిచ్ బంతిని భారీ షాట్ ఆడబోయి టైమింగ్ మిస్ అయ్యాడు.అయితే ఇక్కడే అసలు డ్రామా జరిగింది. వైభవ్ కొట్టిన బంతి గాల్లోకి లేచింది. అక్కడే ఉన్న ఇంగ్లాండ్ ఫీల్డర్ ఆ క్యాచ్ పట్టడానికి పొజిషన్‌లోకి వచ్చాడు. కానీ, ఆ ఫీల్డర్ క్యాచ్‌ను పూర్తిగా అందుకోకముందే, కనీసం అంపైర్ నిర్ణయం కోసం కూడా చూడకుండా వైభవ్ సూర్యవంశీ తీవ్ర అసంతృప్తితో నేరుగా డ్రెస్సింగ్ రూమ్ వైపు నడక ప్రారంభించాడు. బంతి ఫీల్డర్ చేతుల్లో పడకముందే అతడు పిచ్‌ను వదిలి వెళ్లడం గమనార్హం.సాధారణంగా క్రికెట్‌లో క్యాచ్ డ్రాప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ ఫీల్డర్ ఆ క్యాచ్‌ను వదిలేసి ఉంటే వైభవ్ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. కనీసం బంతి ఫీల్డర్ చేతిలోకి వెళ్లే వరకైనా క్రీజులో ఉండాలనే కనీస అవగాహన కూడా లేకుండా ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం ఏంటని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన 14 (10), 13 (5), 15 (10) రన్స్ మాత్రమే చేశాడు. దీంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.