గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాహనదారుల పెట్టేందుకు హుమ్టా సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగింది. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి 18 లక్షలకు పైగా చేరింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో రద్దీని తట్టుకునేందుకు వీలుగా ప్రధాన రహదారుల్లో కారిడార్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించారు. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాలను ఎంపిక చేసి, అక్కడ జంక్షన్ల అభివృద్ధి, పాదచారుల జోన్ల ఏర్పాటును చేపట్టనున్నారు.ఈ పైలట్ ప్రాజెక్టును మొదటి విడతలో భాగంగా, అత్యధిక ట్రాఫిక్ సమస్యలు ఉన్న రూట్లలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. మియాపూర్ నుంచి గండిమైసమ్మ మార్గం, ఒవైసీ హాస్పిటల్ నుంచి తార్నాక మార్గం, ప్యారడైజ్ జంక్షన్ నుంచి అసెంబ్లీ మార్గాల్లో అమలు చేయనున్నారు. చాలా చోట్ల ఫుట్‌పాత్‌లు వ్యాపారాలు, ఇతర నిర్మాణాలతో ఆక్రమణలకు గురికావడం వల్ల పాదచారులు రోడ్లపై నడవాల్సి వస్తోంది. ఇది తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుండటంతో, హుమ్టా ఈ ఆక్రమణలను నిర్దాక్షిణ్యంగా తొలగించనుంది. దీంతో పాటు మెయిన్ రోడ్లపై ప్రత్యేకంగా నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్‌పోర్ట్ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రత్యేక మార్గాలలో బైక్‌లు, కార్లు, బస్సులు వంటి ఎలాంటి మోటారు వాహనాలను అనుమతించరు. కేవలం నడిచి వెళ్లే కాలినడక ప్రయాణికులు, సైకిళ్లపై వెళ్లే వారికి మాత్రమే ఇందులో ప్రవేశం ఉంటుంది.ఈ ప్లాన్‌లో భాగంగా ప్రధాన కూడళ్ల వద్ద జంక్షన్ల రీ- డెవలప్‌మెంట్ పనులు చేపడతారు. వాహనాల సాఫీ ప్రయాణానికి వీలుగా యూ-టర్న్‌లను ఏర్పాటు చేయనున్నారు. రహదారి మధ్యలో సెంట్రల్ మీడియన్ అభివృద్ధి పనులు చేపడతారు. అన్నిటికంటే ముఖ్యంగా స్పేస్ వాకర్స్ పేరుతో రోడ్లపై ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆర్టీసీ బస్సులకు వేర్వేరుగా లేన్ మార్కింగ్స్ వేస్తారు. ఏ వాహనం దానికి కేటాయించిన మార్కింగ్‌లోనే వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల ఒకదానికొకటి అడ్డు రాకుండా వాహనాలు సజావుగా సాగిపోవడానికి వీలవుతుందని అధికారులు చెబుతున్నారు.