పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పిస్తే.. నెలకు 25 కిలోల బియ్యం, రైస్ కుక్కర్, సైకిల్..!

Wait 5 sec.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు జిల్లా గ్రామపంచాయతీ వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్పించిన ప్రతి కుటుంబానికి నెలకు 25 కిలోల అదనపు బియ్యం, ఒక రైస్ కుక్కర్, ఐదో తరగతి పూర్తిచేసిన విద్యార్థికి కొత్త సైకిల్ అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రస్తుతం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించేందుకు ఎక్కువగా మొగ్గుచూపడంతో ప్రభుత్వ పాఠశాల్లో అడ్మిషన్లు భారీగా తగ్గిపోయాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే పాఠశాల మూతపడే ప్రమాదం ఉందని.. గుర్తించిన నాగులపహాడ్ గ్రామపంచాయతీ, ప్రభుత్వ బడిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. నాగులపహాడ్ సర్పంచ్ నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని గ్రామపంచాయతీ, విద్యార్థులకు విద్యతో పాటు కుటుంబాలకు కూడా ఆర్థికంగా కొంత ఊరటనిచ్చేలా ఈ పథకాన్ని రూపొందించింది. బియ్యం, రైస్ కుక్కర్, సైకిల్‌తో పాటు ప్రతి విద్యార్థికి ఉచితంగా స్కూల్ బ్యాగ్, నోట్‌బుక్స్, ఇతర విద్యా సామగ్రిని కూడా అందించనున్నట్లు వెల్లడించింది.ఈ నిర్ణయానికి ఉపసర్పంచ్ రాయి రమేష్‌తో పాటు వార్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని.. గ్రామంలోని ప్రతి చిన్నారి నాణ్యమైన విద్యను ప్రభుత్వ బడిలోనే అభ్యసించాలని కోరారు. "మన ఊరి బడిని మనమే బతికించుకుందాం" అనే సందేశంతో గ్రామపంచాయతీ చేపట్టిన ఈ కార్యక్రమం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేందుకు తీసుకున్న ఈ వినూత్న చర్యపై పలువురు ప్రశంసలు కురిపిస్తుండగా.. ఇతర గ్రామాలు కూడా ఇలాంటి కార్యక్రమాలను అమలు చేయాలని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. ప్రైవేటు స్కూళ్లను వదిలేసి.. ప్రభుత్వ స్కూళ్ల వైపు అడుగులు వేస్తున్నారు. గవర్నమెంట్ స్కూళ్లపై తల్లిదండ్రులకు ఉన్న అభిప్రాయాలు కూడా మారడంతో తమ పిల్లలను అందులోనే చేర్పిస్తున్నారు. కొన్ని స్కూళ్లలో అడ్మిషన్లు కూడా ఫుల్ కావడం విశేషం.