సంగీత సరస్వతిగా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రముఖ గాయని ఎస్. జానకికి రాజన్న సిరిసిల్ల జిల్లాతో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది. ఆమె సినీ జీవితానికి ముందే గడిపిన బాల్యంలోని మధుర జ్ఞాపకాలు ఈ నేలతో ముడిపడి ఉండటం స్థానికులకు ఇప్పటికీ గర్వకారణంగా నిలిచింది. చిన్నతనంలో జానకి సుమారు 6 ఏళ్లపాటు సిరిసిల్లలో గడిపారు. ఆమె తండ్రి శ్రీరామమూర్తి తెలుగు ఉపాధ్యాయుడిగానూ, ఆయుర్వేద వైద్యుడిగానూ సేవలు అందించారు. ఆ సమయంలో జానికి కుటుంబం సిరిసిల్లలోని వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలోని ఒక ఇంట్లో నివసించేది. స్థానిక ప్రజలతో ఆ కుటుంబానికి ఆత్మీయ అనుబంధం ఏర్పడగా.. మరీ ముఖ్యంగా నేత కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగాయి. బాల్యంలో మానేరు వాగు ఒడ్డున స్నేహితులతో కలిసి ఆటలు ఆడటం, పాటలు పాడటం తనకు ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా జానకి అనేక సందర్భాల్లో గుర్తుచేసుకున్నారు. ఆ రోజుల ఆనందం తన జీవితంలో ఎంతో విలువైన భాగమని ఆమె పలు వేదికలపై చెప్పిన సందర్భాలు ఉన్నాయి.సిరిసిల్ల నుంచి ఎడ్లబండిపై వేములవాడకు వెళ్లి సినిమాలు చూసిన అనుభవాలను కూడా జానకి పలుమార్లు పంచుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో పలుమార్లు పాటలు ఆలపించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. సినీ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకున్న తర్వాత కూడా వేములవాడను సందర్శించి తన పాత జ్ఞాపకాలను మరోసారి స్మరించుకున్నారు.2001లో సిరిసిల్లలో నిర్వహించిన ‘సిరి వెలుగుల ఆత్మీయ సమ్మేళనం’ కార్యక్రమంలో ఆమెకు ప్రత్యేక సన్మానం జరిగింది. తొలుత కార్యక్రమానికి హాజరు కాలేకపోయినా.. ఆ తర్వాత సిరిసిల్లకు వచ్చిన సందర్భంగా స్థానిక సాహితీవేత్తలు, అభిమానులు ఘనంగా సత్కరించారు. ఆ కాలంలో సిరిసిల్ల ప్రాంతంలో రైతాంగ ఉద్యమాలు ఉద్ధృతంగా కొనసాగడంతో కుటుంబ పరిస్థితుల దృష్ట్యా జానకి కుటుంబం చెన్నైకి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ సిరిసిల్ల, మానేరు, వేములవాడతో ఉన్న అనుబంధాన్ని ఆమె జీవితాంతం ప్రేమగా గుర్తు చేసుకోవడం ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేకమైన ఆత్మీయతను కలిగించింది.