ప్రజా రవాణా సేవల వాస్తవ పరిస్థితులను స్వయంగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్‌ చేసిన ఆకస్మిక తనిఖీ ఆసక్తికరంగా మారింది. సాధారణ ప్రయాణికుడిలా ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్‌ ధరించి బెంగళూరులోని పలు బీఎంటీసీ బస్సుల్లో అర్ధరాత్రి వరకు ప్రయాణించిన మంత్రి.. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా గమనించారు. ఈ తనిఖీల్లో భాగంగా హెబ్బాల్‌ నుంచి నాగశెట్టిహళ్లి వెళ్లే బస్సు ఎక్కిన మంత్రి.. టికెట్ తీసుకునే సమయంలో చిల్లర లేకపోవడంతో.. దిగిపోవాలని కండక్టర్ చెప్పడం గమనార్హం. ఈ క్రమంలోనే మంత్రి బైరతి సురేష్.. బస్సు ఎక్కిన తర్వాత రెండు టికెట్లు ఇవ్వాలని కోరుతూ కండక్టర్‌కు రూ.100 నోటు ఇచ్చారు. అయితే తన వద్ద చిల్లర లేదని చెప్పిన కండక్టర్‌.. సరిపడా చిల్లర తీసుకురాకపోతే బస్సు నుంచి దిగిపోవాలని సూచించారు. మంత్రి అసలు ఎవరో తెలియక సాధారణ ప్రయాణికుడిగా భావించిన కండక్టర్‌ ఈ విధంగా ప్రవర్తించాడు. మంత్రి ఎలాంటి వాదనకు దిగకుండా బస్సు నుంచి దిగిపోయి తన పరిశీలనను కొనసాగించారు.ఇదే తనిఖీల సమయంలో మరో ఘటన కూడా ఆయన దృష్టికి వచ్చింది. ఒక బస్‌స్టాప్‌లో ప్రయాణికుడు చేతి ఊపి బస్సు ఆపాలని సంకేతం ఇచ్చినా డ్రైవర్‌ బస్సును ఆపకుండా ముందుకు తీసుకెళ్లాడు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ఈ నిర్లక్ష్యాన్ని మంత్రి తీవ్రంగా పరిగణించారు. బస్సులతో పాటు ఆటో సేవలను కూడా పరిశీలించిన మంత్రి.. నాగశెట్టిహళ్లి ప్రాంతంలో ఆటోలో ప్రయాణించారు. మీటర్‌లో రూ.30 చూపించినప్పటికీ డ్రైవర్‌ రూ.36 చెల్లించాలని డిమాండ్ చేయడంతో దానిపై ఆయన వివరణ కోరారు. మీటర్‌ను ఇంకా సరిచేయలేదని డ్రైవర్‌ చెప్పడంతో చివరకు మంత్రి రూ.40 చెల్లించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాల ఆధారంగా ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించిన కండక్టర్‌.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన డ్రైవర్‌పై సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలని మంత్రి బైరతి సురేష్.. ఉన్నతాధికారులకు సూచించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ ఉపేక్షించబోమని ఈ ఘటన ద్వారా స్పష్టమైన సంకేతం ఇచ్చారు.