ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు తీపికబురు చెప్పింది.. తక్కువ ధరకే నిత్యావసర వస్తువుల్ని అందించేందుకు రాష్ట్రంలో మీ మార్టులకు శ్రీకారం చుట్టింది. బహిరంగ మార్కెట్‌లో కంటే అతి తక్కువ ధరలకే మీ మార్టుల్లో సరుకులు అందుబాటులో ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30వేల రేషన్ షాపుల డీలర్ల కుటుంబాలకు ఆర్థిక భరోసాతో పాటుగా ప్రజలకు తక్కువ ధరకే సరుకులు అందించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మార్టుల్ని ప్రారంభిస్తుండగా.. మొదటి మార్టుని గుంటూరు శివారులో ఉన్న లాలుపురంలో పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రారంభించారు. రేషన్ షాపులకు అనుసంధానంగా ఈ మీ మార్టులు పనిచేస్తాయన్నారు మంత్రి మనోహర్.బయట మార్కెట్ రేట్ల కంటే రూ. 3 నుంచి రూ. 4ల తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందిస్తాన్నారు మంత్రి. మీ మార్టుల ద్వారా ప్రస్తుతం 60 రకాల సరుకులతో ప్రారంభిస్తున్నామని.. రాబోయే రోజుల్లో 250కి పైగా సరకులు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ మీ మార్టుల ద్వారా రేషన్ డీలర్లకు అదనంగా ఆదాయం వస్తుందని.. ముందుగా వెయ్యి మార్టులు ప్రారంభిస్తామని.. వీటిలో 553 ప్రారంభానికి సిద్ధంగా ఉంటే, వీటిలో 9 మాత్రం ఇప్పుడు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మీమార్టుల్లో డిజిటల్‌ రూపీ విధానాన్ని తీసుకొస్తామని.. రేషన్ షాపుల్ని ఆధునీకరిస్తాము అన్నారు.రేషన్‌ డీలర్ల ఆర్థిక స్వావలంబన కోసమే . ఈ మార్టుల ద్వారా ప్రజలకు ఒకే చోట నాణ్యమైన నిత్యావసర వస్తువులను అందుబాటు ధరలకు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం రేషన్ డోర్ డెలివరీ పేరుతో 9వేల360 ఎండీయూ వాహనాలను తీసుకొచ్చి 29,750 డీలర్ల జీవితంపై దెబ్బ కొట్టిందన్నారు. కార్పొరేట్ తరహాలోనే గ్రామీణ రేషన్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకువస్తున్నామన్నారు. రేషన్ షాపుల్ని జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.రేషన్ షాపుల్లో రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరల్లో అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో వీటిని ప్రారంభించామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్రవ్యాప్తంగా 1000 “మీ మార్ట్” దుకాణాలను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. “మీ మార్ట్” ద్వారా నాణ్యమైన సరుకులు సరసమైన ధరలకు ప్రజలకు అందిస్తూ, ప్రతి కుటుంబానికి ఆర్థికంగా ఉపశమనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందడంతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయొచ్చన్నారు. మొత్తం మీద ఏపీ ప్రజలకు అతి తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులు కొత్తగా ప్రారంభించిన ఈ మీ మార్టులు ద్వారా అందుబాటులోకి వచ్చాయి.