ఏపీలో మరో పథకం అమలు.. ఒక్కొక్కరి అకౌంట్‌లోకి నేరుగా రూ.25వేలు జమ

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో త్వరలోనే నేతన్న భరోసా పథకాన్ని అమలు చేస్తామని మంత్రి సవిత తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే పూర్తి చేశారని.. అర్హులైన వారికి ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తామన్నారు. మంగళగిరిలోని ఆప్కో తోటలో స్వర్ణోత్సవ వేడుకలు జరిగాయి. మంత్రి ఈ కార్యక్రమంలో కీలక ప్రకటన చేశారు. ఏపీ ప్రభుత్వం కింద ఒక్కో నేత కార్మికుడికి ఏడాదికి రూ.25వేల చొప్పున అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఆప్కోకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు మంత్రి. రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులకు పెట్టుబడి భారం తగ్గించేలా ఆప్కో ద్వారా నూలును సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తోందని తెలిపారు సవిత. నేటి తరం వారి అభిరుచులకు తగిన విధంగా.. రెడీమేడ్ చేనేత వస్త్రాల తయారు చేసేలా నేతన్నలకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఆప్కో నుంచి చేనేత సహకార సంఘాలను చెల్లించాల్సిన బకాయిలు రూ.6.50 కోట్లు త్వరలోనే చెల్లిస్తామని ప్రకటించారు. ఈ నెల 15న ఆప్కో బకాయిల్లో రూ.4 కోట్లు, వచ్చే నెల మొదటి వారంలో మరో రూ.2.50 కోట్లను చెల్లిస్తామన్నారు. ఆప్కోతో టీటీడీ ఒప్పందం చేసుకుందని.. చేనేత సంఘాలు కనుక ముందుకు వస్తే టీటీడీకి అవసరమైన శాలువాలు, కండువాలు, ఇతర వస్త్రాల కొనుగోలుకు ఆర్డర్లు ఇస్తామన్నారు. ఆప్కో బలోపేతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని.. లాభాల బాట పట్టిస్తామన్నారు మంత్రి సవిత. అన్న ఎన్టీఆర్ చేనేత వస్త్రాలకు జనతా వస్త్రాల పేరుతో ఎంతో ప్రచారం కల్పించారన్నారు మంత్రి సవిత. ఆయన స్ఫూర్తితో పాలన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నారని.. ఏపీ చేనేత రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారన్నారు. కేంద్రం నుంచి అప్కోకు స్కోచ్ అవార్డు దక్కిందన్నారు. మంత్రి సవిత ఆప్కోలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెక్కులు అందజేశారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల సంక్షేమానికి పెద్ద పీట వేశామన్నారు సవిత. ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని.. వెనుకబడిన వర్గాలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయన్నారు. ఈ రెండేళ్లలో బీసీల సంక్షేమానికి ఏకంగా రూ.1.37 లక్షల కోట్లు కేటాయించామన్నారు. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రూ.110 కోట్ల పెండింగ్‌ డైట్‌ ఛార్జీలను కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు మంత్రి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 109 జ్యోతిరావు పూలే గురుకుల విద్యా సంస్థలు ఉన్నాయి.. కొత్తగా మరో 10 గురుకులాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ గురుకులాల్లో విద్యార్థులకు విద్య, నాణ్యమైన భోజనం అందిస్తున్నామని.. వారి ఆరోగ్యం, భద్రతకు శ్రద్ధ తీసుకున్నామన్నారు. రూ.500 కోట్ల సాస్సీ నిధుల్ని గురుకులాలకు శాశ్వత భవనాల నిర్మాణం కోసం కేటాయించారన్నారు.