E20 Petrol: మన దేశంలో ప్రస్తుతం ఈ20 పెట్రోల్ పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎక్కడా సాధారణ పెట్రోల్ లభించడం లేదు. పూర్తిగా 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ మిశ్రమమే వాహనాల్లో కొట్టించుకోవాలి. అయితే, 2023 కంటే ముందు తయారైన పాత వాహనాలు (E10 అనుకూలంగా డిజైన్ చేసినవి) ఈ ఈ20 పెట్రోల్ నిరంతరం వాడడం వల్ల వాటి ఇంధన వ్యవస్థలో సమస్యలు వస్తాయని వాహనదారులు, విశ్లేషకులు మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. ఎలాంటి సమస్యలు ఉండవని పేర్కొంది. అయితే, తాజాగా ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) విడుదల చేసిన నివేదిక వాహనదారులను కలవరపెడుతోంది. వాటి ఇంధన వ్యవస్థలోని రబ్బర్ పైపులవు, గ్యాస్కెట్లు, సీల్స్, ఓ-రింగ్స్ కాల క్రమేణా పాడైపోయే ప్రమాదం ఉందని రిపోర్ట్ హెచ్చరించింది. ఇథనాల్‌కు ఉండే తేమను పీల్చుకునే గుణం, రబ్బరును క్షీణింపజేసే స్వభావమే ఇందుకు కారణంగా నివేదిక పేర్కొంది. పాత బైకులు, కార్లు వాడుతున్నట్లయితే ఈ20 పెట్రోల్ తో వాటి రబ్బరు విడిభాగాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని తేల్చింది. ఆయా విడిభాగాలను మార్చాల్సి రావచ్చని పేర్కొంది. ఈ10 ఇంధనానికి మాత్రమే అనుకూలంగా ఉండే పాత వాహనాల్లో ఈ20 పెట్రోల్ వాడడం వల్ల ఫ్యూయల్ సిస్టమ్ లోని రబ్బర్ పైపులు, గ్యాస్కెట్లు, సీల్స్ దెబ్బతినేందుకు అవకాశం ఉందని ఏఆర్ఏఐ నివేదిక స్పష్టం చేసింది. వీటిని నిర్ణీత కాలంలో మార్చాల్సి రావచ్చని పేర్కొంది. అలాగే వాహనాల్లోని ఇనుము లేదా ఇతర మెటల్ భాగాలపై ఇథనాల్ వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం పడడం లేదని తెలిపింది. 4-వీలర్ వాహనాల టెస్టింగ్‌లో మిశ్రమ ఫలితాలు వచ్చాయని తెలిపింది. ఒక ప్రముఖ కంపెనీ ఇంజిన్ 400 గంటల రన్నింగ్ తర్వాత కూడా బాగానే పని చేసిందని, మరో కంపెనీకి చెందిన ఇంజిన్ లో 809 గంటల తర్వాత ఎగ్జాస్ట్ వాల్వ్ దెబ్బతిన్నట్లు గుర్తించింది. ముఖ్యంగా బీఎస్ 6 టర్బోఛార్జ్డ్ ఇంజిన్లలో 265 గంటల తర్వాత కొన్ని సమస్యలు వచ్చినట్లు తేల్చింది. ఇక టూ-వీలర్లకు ఎలాంటి డోకా లేదని పేర్కొంది. మూడు ప్రధాన కంపెనీల బైకులు, స్కూటర్లపై జరిపిన పరీక్షల్లో ఎలాంటి సమస్యలు రాలేదని తెలిపింది. టూ-వీలర్లలో ఈ20 ఇంధన పనితీరు బాగుందని నివేదిక తెలిపింది. సాధారణ పెట్రోల్ తో పోలిస్తే ఈ20 పెట్రోల్ వాడినప్పుడు వాహనాల మెడల్ బట్టి మైలేజీ 2 శాతం నుంచి 6 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.వాహనదారులు చేయాల్సిన పనులివే సర్వీసింగ్ సమయంలో తనిఖీ చేయించుకోవాలి. మార్కెట్లో దొరికే మంచి క్వాలిటీ గల ఇథనాల్ ఫ్యూయల్ యాడిటివ్స్ ఉపయోగించడం వల్ల ఇంధన ట్యాంకులో తేమ చేరకుండా రబ్బర్ భాగాలు త్వరగా పాడవకుండా కాపాడుకోవచ్చు. పెట్రోల్ బంకుల్లో ఇఁధనం కొటించేటప్పుడు వీలైతే నమ్మకమైన, రద్దీ ఉండే బంకులను ఎంచుకోవడం మంచిది. నిల్వ ఉన్న ఇంధనంలో తేమ శాతం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది.