తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ రాష్ట్రంలో ఇండియా కూటమిలో విభేదాలు బహిర్గతం అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి నేతృత్వంలోని డీఎంకే.. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో చేర్చాలన్న ప్రతిపాదనను డీఎంకే స్పష్టంగా తిరస్కరించింది. బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్ర రాజకీయాలు వేరు.. జాతీయ రాజకీయాలు వేరు అనే విధానాన్ని అనుసరించాలని వీసీకే పార్టీ అధ్యక్షుడు థోల్ తిరుమావళవన్ సూచించగా.. ఆ ప్రతిపాదనకు కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపింది.అయితే.. వీసీకే, కాంగ్రెస్ చేసిన ఈ ప్రతిపాదనను డీఎంకే తీవ్రంగా ఖండించింది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. ప్రభుత్వ ఏర్పాటు సమయంలో తమతో ఉన్న పొత్తును కాంగ్రెస్ పార్టీ విరమించుకుని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిందని.. ఇది రాజకీయ ద్రోహం అని డీఎంకే తీవ్ర ఆరోపణలు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కేరళ, పశ్చిమ బెంగాల్ లాగా తమిళనాడులో డీఎంకే పనిచేయదని.. ఆ పార్టీ ఎంపీ గణపతి పి. రాజ్‌కుమార్ తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ.. వీకేసీ పార్టీని మధ్యవర్తిగా ఉపయోగించి మళ్లీ తమను ఒప్పించే ప్రయత్నం చేస్తోందని విమర్శలు గుప్పించారు.డీఎంకే అభిప్రాయం ప్రకారం.. తమిళనాడు రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తమిళనాడులో టీవీకే ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల మాదిరిగా జాతీయ-రాష్ట్ర రాజకీయాలను వేర్వేరుగా చూడడం సాధ్యం కాదని ఆ పార్టీ పేర్కొంది. అంతేకాకుండా ప్రస్తుతం పార్లమెంట్‌లో ఒక్క ఎంపీ కూడా లేని టీవీకేను ఇండియా కూటమిలో చేర్చాలా అనే అంశంపై కూడా విస్తృత చర్చ అవసరమని డీఎంకే అభిప్రాయం వ్యక్తం చేసింది. అయినప్పటికీ బీజేపీనే తమకు రాజకీయంగా, సిద్ధాంతపరంగా ప్రధాన ప్రత్యర్థి అని డీఎంకే పార్టీ పేర్కొంది.మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ ఎంపీ జోతిమణి మాత్రం దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో టీవీకేకు పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం లభిస్తే ఇండియా కూటమిలో దాని పాత్రపై మళ్లీ చర్చించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. మరోవైపు.. దీనికి ముందుగా ముఖ్యమంత్రి విజయ్‌ని ఒప్పించాలని డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఎలంగోవన్ సూచించారు. తన ప్రధాన రాజకీయ శత్రువు డీఎంకేనే అని సీఎం విజయ్ బహిరంగంగా చెబుతున్నప్పుడు.. ఈ రెండు పార్టీలు ఒకే కూటమిలో ఎలా ఉండగలవు అని ఆయన ప్రశ్నించారు. ఈ పరిణామాలన్నీ తమిళనాడులో అంతర్గత విభేదాలను మరింత స్పష్టంగా బయటపెట్టడమే కాకుండా.. జాతీయ రాజకీయ అవసరాలు, రాష్ట్ర రాజకీయ వాస్తవాల మధ్య సమతుల్యత సాధించడం ప్రతిపక్షాలకు ఎంత కష్టమో వెల్లడిస్తున్నాయి.