ఆటోనగర్‌లో అన్ని రకాల వెహికల్స్ హాల్ట్‌లో ఉంటాయి. కొన్ని మరమ్మతుల కోసం తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్‌కి సంబంధించిన బస్సులు కూడా ఇక్కడ ఉంటాయి. ఆదివారం రాత్రి వేళ ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్ హైవే పై రయ్యి రయ్యిమంటూ వెళ్లాలంటే ఇక్కడ చిన్న చిన్నరిపేర్స్ చేయాలి. అలాంటి ఆటోనగర్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగి ఏడు బస్సులు దగ్ధమయ్యాయి. విజయవాడ ఆటోనగర్‌లో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మరమ్మతుల కోసం తీసుకొచ్చిన బస్సులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఏడు బస్సులు పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తోంది. ఓ మెకానిక్ షెడ్డులో రిపేర్స్ కోసం బస్సులను నిలిపి ఉంచగా.. అందులోని ఓ బస్సు నుంచి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఆ మంటలు మిగితా బస్సులకూ వ్యాపించాయి. READ ALSO ఆటోనగర్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే మూడు ఫైర్ ఇంజన్లు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాయి. అగ్నిమాపక సిబ్బంది ఎంత ప్రయత్నించినా అప్పటికే ఏడు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోలేదు, ఏ ఒక్కరూ గాయపడలేదు. ప్రమాదానికి అసలు కారణం ఏంటో మాత్రం ఎవ్వరికీ తెలియలేదు. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒక బస్సుకు రిపేర్ చేస్తుండగానే మంటలు అంటుకున్నాయని అక్కడి స్థానికుల సమాచారం మేరకు తెలుస్తోంది. అయితే, ఆ మంటలు ప్రమాదవశాత్తు అంటుకున్నాయా? లేక ఎవరైనా కావాలనే చేశారా అన్నది మాత్రం తెలియలేదు. దట్టమైన పొగలు వ్యాపించడంతో అక్కడున్న వారు భయాందోళనకు గురయ్యారు. చుట్టూ వెహికల్సే ఉండటంతో ఆ మంటలు మిగతా వాటికి కూడా అంటుకునే ప్రమాదం ఉందని భయపడ్డారు.. కానీ అగ్నిమాపక సిబ్బంది సరైన సమయానికి సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.