SIR పేరుతో భారీ మోసం.. మహిళ వద్ద 3 తులాల బంగారు పుస్తెలతాడు చోరీ

Wait 5 sec.

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఎస్‌ఐఆర్ (SIR) దరఖాస్తు పేరుతో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మహిళను నమ్మించి సుమారు 3 తులాల బంగారు పుస్తెలతాడును అపహరించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు మోసాలకు పాల్పడుతున్న తీరుపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం రోజున ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి.. ఓటరు సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్) అప్లికేషన్ కోసం ఫోటో తీయాల్సి ఉందని బాధిత దంపతులను నమ్మించారు. అయితే ఫోటో తీసే సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు.. ఆ మహిళ మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును తీసి ఆమె భర్తకు ఇవ్వాలని సూచించారు. అయితే వారి మాటలను నమ్మిన ఆ మహిళ.. పుస్తెలతాడును తీసి తన భర్త చేతికి ఇచ్చింది.ఆ తర్వాత మహిళను ఫోటో తీసి.. సమీపంలో ఉన్న ఆలయం వద్ద దరఖాస్తు ప్రక్రియను కొనసాగించాలని చెబుతూ కొంత దూరం తీసుకెళ్లారు. ఇదే సమయంలో మరో వ్యక్తి.. ఆ మహిళ భర్త వద్దకు వెళ్లి అతని చేతిలో ఉన్న బంగారు పుస్తెలతాడును తీసుకుని సహచరుడితో కలిసి బైక్‌పై పరారీ అయినట్లు బాధితులు వెల్లడించారు.అనంతరం కొద్దిసేపటికే తాము మోసపోయామని గుర్తించిన బాధిత దంపతులు.. వెంటనే పోలీసుల వద్దకు వెళ్లి సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.ప్రభుత్వ పథకాలు.. నమోదు ప్రక్రియలు లేదా దరఖాస్తుల పేరుతో ఎవరైనా నగలు తొలగించాలని, వ్యక్తిగత వస్తువులు అప్పగించాలని కోరితే వెంటనే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఎవరు పడితే వాళ్లు వస్తే.. వారిని నమ్మొద్దని పేర్కొంటున్నారు.