ప్రముఖ నటుడు, సినీ రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి చాలా గ్యాప్ తర్వాత తన స్వీయ దర్శక నిర్మాణంలో 'ఆపరేషన్ అరుణా రెడ్డి' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రిలీజుకు రెడీ అవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా మెగాస్టార్ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పారు. చిరంజీవి ఒకరికి హాని చేసే వ్యక్తి కాదని, ఆయన ఎవరి ద్వేషాన్ని కోరుకోడని పోసాని పేర్కొన్నారు.పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ.. “నేను ఎవరినీ గుర్తు పెట్టుకోను.. నేను ఎవరి నాశనాన్ని కోరుకోను. అభిప్రాయ బేధాలు ఉన్నప్పుడు దూరంగా ఉండటం మేలు అనుకుంటాను తప్పితే, వాడిని నాశనం చేయాలి అనుకోను. నన్ను తిట్టినవాళ్లకు ఒంటి మీద బట్టలు లేకపోతే కొనిచ్చిన వ్యక్తిని నేను. వాళ్ల ఇంట్లో అన్నం తినడగానికి ఒక బల్లా కూడా లేకపోతే, వెంటనే నా ఇంట్లో డైనింగ్ టేబుల్ ను వాళ్ల ఇంటికి పంపించాను. ఇంకా ఏమైనా కావాలంటే చేసే వ్యక్తినే తప్ప, వాళ్లని నాశనం చేయాలని అనుకోను. అసలు అలాంటి ఆలోచన కూడా నాకు రాదు” అని అన్నారు. తనకు చిరంజీవి మీద ఇష్టం అలానే ఉందని చెప్పిన పోసాని కృష్ణ మురళి.. ఆయన్ని ద్వేషించడానికి తనకేమీ అన్యాయం చేయలేదని తెలిపారు. ‘’మన అభిప్రాయం నచ్చనప్పుడు ద్వేషిగా మారిపోతాం. చిరంజీవి ఎవరి ద్వేషాన్ని కోరుకోడని నాకు తెలుసు. ఆయన పద్ధతి కూడా బాగా తెలుసు. ఎవరైనా తన దగ్గరకు వస్తే గౌరవంగా మాట్లాడి పంపిస్తారు. ఈరోజు వరకూ ఆయన ఎవరినీ అవమానించి పంపలేదు. అలాంటివి ఎప్పుడూ మేం చూసి ఎరగం. ఆయన చాలా ఫ్రెండ్లీగా, క్లీన్ గా ఉంటారు” అని పోసాని అన్నారు.గతంలో చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ పార్టీలో పోసాని కృష్ణ మురళి క్రియాశీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 2009 ఎన్నికలలో ఈయన చిలకలూరిపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ‘ప్రజారాజ్యం’ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, వైఎస్సార్సీపీకి సపోర్ట్ చేశారు. గత ప్రభుత్వంలో ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ చైర్మన్‌ గా పని చేశారు. 2024 ఎన్నికలకు ముందు చిరంజీవిపై పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి మద్దతు ప్రకటించడంపై పోసాని కృష్ణమురళి విరుచుకుపడుతున్నారు. రాజకీయాలు సరిపోవంటూ వదిలేసి వెళ్లిపోయిన చిరంజీవి.. మళ్లీ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. జనసేనకు ఓటు వేయమని ఎలా కోరుతారంటూ నిలదీశారు. చిరంజీవి సినిమాల మాదిరిగానే రాజకీయాలను కూడా బిజినెస్ గా చూస్తారని ఆరోపించారు. ఆయన అసలు రాజకీయాలకు పనికి రాడని విమర్శించారు. ‘ప్రజారాజ్యం’ పార్టీ పెట్టి 18 మంది అభ్యర్థులతో అసెంబ్లీలో అడుగుపెట్టారని, కానీ ఏ రోజూ ప్రజా సమస్యల గురించి పట్టించుకోలేదన్నారు. చిరంజీవి పార్టీ పెట్టిన తక్కువ కాలంలోనే కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యారని, పదవీకాలం పూర్తవ్వగానే కాంగ్రెస్ పార్టీని పట్టించుకోవడం మానేశారని పోసాని కృష్ణమురళి విమర్శించారు. చిరంజీవిని నమ్మి ఓటు వేసిన కాపు సోదరులను మోసం చేశారని పేర్కొన్నారు. తాను కూడా ప్రజారాజ్యం తరపున పోటీ చేశానని, కానీ చిరంజీవికి రాజకీయాల పట్ల నిబద్ధత లేదని పోసాని ఘాటుగా మాట్లాడారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా చిరంజీవి, పోసాని కలిసి కనిపించలేదు. అయితే చిరు అంటే తనకు ఇప్పటికీ ఇష్టం ఉందని పోసాని చెబుతున్నారు.