రంగారెడ్డి జిల్లా షాబాద్‌ను వణికించిన నిందితుడు రాజ్‌కుమార్ ఆచూకీపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. ఘోర హత్యాకాండకు పాల్పడిన అనంతరం నిందితుడు పరారవగా, అతడిని పట్టుకునేందుకు పోలీసులు దాదాపు 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. హత్యలు చేసిన తర్వాత రాజ్‌కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి తాను చనిపోతానని చెప్పినట్లు తేలింది. అయితే, నందిగామ సమీపంలో అతడి కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు, మొబైల్ లొకేషన్ కూడా అక్కడే నిలిచిపోయినట్లు గుర్తించారు. కారును అక్కడే వదిలివేసిన రాజ్‌కుమార్ నందిగామ రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిర్ధారణ అయింది. ప్రస్తుతం రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు.. అతడు ఆత్మహత్య చేసుకోలేదని, తప్పించుకోవడానికి రైలు ఎక్కి పారిపోయాడనే స్పష్టతకు వచ్చారు.గతంలో బాలికను వేధించిన కేసులో పోక్సో చట్టం కింద అరెస్ట్ అయిన రాజ్‌కుమార్.. జైలు నుండి విడుదలయ్యాక కక్ష పెంచుకున్నాడు. శనివారం నేరుగా ఆ బాలిక ఇంటికి వెళ్లి ఆమెతో పాటు ఆమె తల్లి, నానమ్మలను అత్యంత దారుణంగా నరికి చంపాడు. అంతటితో ఆగకుండా.. భార్య, ఇద్దరు పిల్లలను సైతం దారుణంగా హతమార్చాడు. ఒకేసారి ఆరుగురిని పొట్టనబెట్టుకున్న ఈ దారుణ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. కాగా, నిందితుడి నుంచి ప్రాణభయం ఉందని బాధితులు అనేకసార్లు మొరపెట్టుకున్నా స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘోరం జరిగిందని మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు దిగారు. బాధితుల ఫిర్యాదులపై అలసత్వం వహించినందుకు గానూ షాబాద్ ఎస్సై రమేశ్‌ను ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తక్షణమే సస్పెండ్ చేస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు.నిందితుడు రాజ్‌కుమార్ గత ఏడాది కాలంగా సదరు మైనర్ బాలికను తీవ్రంగా వేధిస్తుండటంతో.. వారి కుటుంబం తమ రక్షణ కోసం ఇంటి ముందు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకుంది. మే 16న బాలిక తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు కాగా.. నిందితుడు అజ్ఞాతంలోకి వెళ్లాడు. జూన్ 12న ముందస్తు బెయిల్ వచ్చే వరకు పోలీసులు అతడిని పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జైలు నుండి వచ్చాక 'మీ అంతు చూస్తా' అని రాజ్‌కుమార్ బెదిరించగా.. ఆ విషయాన్ని కేసు దర్యాప్తు అధికారి అయిన ఎస్సై రమేశ్ దృష్టికి తీసుకెళ్లినా.. అతడే భయపడుతున్నాడు.. మీరేం కంగారు పడొద్దు అని తేలిగ్గా తీసిపడేశారని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసుల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం కారణంగానే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు నిందితుడి కుటుంబం కూడా బలవ్వాల్సి వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.