కర్ణాటకలో లేని సమస్య ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు వస్తోందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పొగాకు కొనుగోళ్లకు సంబంధించి రైతుల్లో నమ్మకం, ధైర్యం కల్పించేలా చేయాలని సూచించారు. కర్ణాటకలో పొగొకు కొనుగోలుకు ఎలాంటి సమస్య లేదని.. ఇక్కడ ఎందుకు వస్తుందని పొగాకు వ్యాపారులు, బోర్డు అధికారుల్ని ప్రశ్నించారు. అమరాతిలోని సచివాలయంలో పొగాకు కొనుగోళ్లపై అధికారులు, వ్యాపారులతో చర్చించారు. కిలో పొగాకును రూ.200కు తగ్గకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. ఈ ధర ఇవ్వాల్సిందే, పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఒకవేళ ఎవరైనా రైతుల్ని ఇబ్బందిపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. పొగాకు కొనుగోళ్లపై ఏకంగా ఐదుసార్లు సమీక్షలు చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. పొగొకు బోర్డు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.. కంపెనీ నిర్లక్ష్యం కూడా ఉందన్నారు. ఒకవేళ రైతులు పొగాకు సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే ఎదురయ్యే పరిణామాలను కూడా కంపెనీలు ఆలోచిస్తే మంచిదని హితవు పలికారు. 28 కంపెనీలు పొగాకు కొనుగోళ్లకు సంబంధించి సమర్పించిన ఇండెంట్‌తో పాటుగా కొనుగోళ్ల వివరాలను చంద్రబాబు పరిశీలించారు. కొన్ని కంపెనీలు ఇండెంట్‌కు కొనుగోళ్లకు మధ్య వ్యత్యాసం గురించి తెలిసి అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బందిపెట్టేలా నడుచుకుని కంపెనీలు గుడ్ విల్ పోగొట్టుకోవద్దని.. కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.పొగాకును డిమాండ్‌కు మించి సాగు చేయడమే ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. వాస్తవానికి 142 మిలియన్ కిలోల ఉత్పత్తికి ఇండెంట్ ఇస్తే రైతులు మాత్రం ఏకంగా 232 మిలియన్ కిలోలు పండించారని చెప్పుకొచ్చారు. తాము అవసరానికి మించి పొగాకును కొనుగోళ్లు చేశామని.. దీనికి తోడు పొగాకు ఎగుమతులు కూడా తగ్గి, మార్కెట్ కూడా పెద్దగా లేదన్నారు. అయినా సరే రైతుల నుంచి కొనుగోళ్లు చేస్తామన్నారు. రాష్ట్ర రైతాంగానికి అండగా ఉంటూ, వారికి న్యాయమైన మద్దతు ధర దక్కేలా చేయడం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు వ్యసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు కొనుగోళ్లు కొనసాగిస్తామని కంపెనీల ప్రతినిధులు చెప్పాయన్నారు. పొగాకు రైతులకు ఆందోళన అవసరం లేదన్నారు.