హైవేపై పెద్ద పెద్ద వెహికల్స్ ఎంత స్పీడుతో వెళ్తుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రెండు వెహికల్స్ పక్కపక్కనే ఉంటే కొంతమందయితే ఇగోకి వెళ్లి పోటీపడుతుంటారు. ఓవర్ టేక్ చేసేందుకు తెగ ప్రయత్నిస్తుంటారు. ఆ ఓవర్ టేక్ చేసే వరకూ వాళ్ల ఇగో సాటిస్ఫై అవ్వదు. అయితే, ఇద్దరు డ్రైవర్లు ఇగోలకు వెళ్లి హైవేపై గొడవపడుతుండగా మధ్యలో ట్రావెల్స్ బస్సు వచ్చి ఆ ఇద్దర్నీ ఢీకొన్న ఘటన మద్దిపాడు మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కృష్ణా జిల్లా గొల్లమూడి గ్రామానికి చెందిన డ్రైవర్ కనగాల వెంకటసుబ్రహ్మణ్య ప్రసాద్ (52) విజయవాడ నుంచి చెన్నైకు లారీలో సరుకు తీసుకెళ్తున్నాడు. చెన్నైకి చెందిన మరో డ్రైవర్ మురుగేశ్ గౌండర్ కూడా చెన్నై వైపే వెళ్తున్నాడు. అయితే, ప్రకాశం జిల్లా మండలం ఏడుగుండ్లపాడు వద్దకు రాగానే రెండు లారీలు పోటీపడసాగాయి. READ ALSO ఒకరి లారీని మరొకరు ఓవర్ టేక్ చేసుకునే సమయంలో కాస్త గొడవ జరిగింది. దాంతో ఇద్దరూ తమ లారీలను పక్కకు ఆపి ఏడుగుండ్లపాడు ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీదే గొడవకు దిగారు. ఇదే సమయంలో విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఫ్లై ఓవర్ వద్దకు రాగానే ఆగి ఉన్న లారీ బలంగా ఢీకొంది. ఆ లారీ ముందు వైపు గొడవ పడుతున్న ఇద్దరు డ్రైవర్ల వైపు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో మురుగేష్ గౌండర్ అక్కడికక్కడే మృతిచెందగా, మరో డ్రైవర్‌ను హుటాహుటిన ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ వెంకటసుబ్రహ్మణ్య ప్రసాద్ కూడా మరణించాడు. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న మద్దిపాడు పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో వారిని రిమ్స్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. హైవే బ్రిడ్జి మీద ఆపి గొడవ పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.