: భారత స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటీవల అద్విత్ జువెల్స్ ఐపీఓకు మంచి రెస్పాన్స్ రాగా ఇక . అయితే ఇప్పుడు ఎస్బీఐ- అముండీకి చెందిన మ్యూచువల్ ఫండ్ విభాగం ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ కూడా (ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్) ఐపీఓకు మరో వారం రోజుల్లోపే ఎంట్రీ ఇస్తుంది. ఇటీవల ప్రాథమిక ముసాయిదా పత్రాలకు సెబీ ఆమోదం లభించగా ఇప్పుడు రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (RHP) కూడా ఫైల్ చేసింది. ఈ ఐపీఓ జులై 14న సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ కాబోతుండగా జులై 16 వరకు షేర్లను దక్కించుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే అదే లాస్ట్ డేట్ అని చెప్పొచ్చు. యాంకర్ ఇన్వెస్టర్లు ఒకరోజు ముందు బిడ్స్ దాఖలు చేసుకోవచ్చు. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లకు (QIB) సబ్‌స్క్రిప్షన్ పీరియడ్ జులై 15తో ముగుస్తుంది. తాజాగా ఐపీఓ కోసం ప్రైస్ బ్యాండ్ కూడా ఫిక్స్ చేసింది. ధరల శ్రేణి రూ. 545- 574 గా నిర్ణయించింది. ఈ ధరల మధ్య ఎక్కడైనా బిడ్స్ వేసుకోవచ్చు. కానీ చాలా వరకు అప్పర్ ప్రైస్ బ్యాండ్ ధరే ఇష్యూ ప్రైస్‌గా ఉంటుంది. ఇక ఒక్కో లాట్ కింద 26 షేర్లు కొనుగోలు చేయొచ్చని తెలుస్తోంది. ఈ లెక్కన గరిష్ఠ ధర దగ్గర చూస్తే కనీస పెట్టుబడి రూ. 14,924 గా ఉంటుంది. షేర్ల అలాట్‌మెంట్ జులై 18న ఉండగా, స్టాక్ ఎక్స్చేంజీల్లో జులై 21న లిస్టింగ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అప్పర్ ప్రైస్ బ్యాండ్ దగ్గర చూస్తే ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ మార్కెట్ విలువ రూ. 1.17 లక్షల కోట్లుగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక ఇందులో ఐపీఓలో భాగంగా ప్రమోటర్లు ఎస్బీఐ, ఫ్రాన్స్‌కు చెందిన అముండీ ఇండియా తమ వాటా విక్రయం ద్వారా రూ. 11,102 కోట్ల మేర నిధుల్ని సమీకరించాలని ప్లాన్ చేస్తున్నాయి. ఈ రెండింటి వాటా కలిపి సంస్థలో 98 శాతం వరకు ఉంది. ఇప్పుడు ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) విధానంలోనే ఉండనుంది. కొత్త షేర్లను జారీ చేయట్లేదు. ఏకంగా 20,37,09,239 ఈక్విటీ షేర్లను విక్రయించనున్నాయి. ఇది దాదాపు 10.0013 శాతం వాటాకు సమానం.ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ జీఎంపీ ఎంతుందంటే?ఇక్కడ ఎస్బీఐ చూస్తే 12,83,34,397 షేర్లను విక్రయించనుండగా ఇది 6.3 శాతం వాటాకు సమానం. ఇక అముండీ ఇండియా హోల్డింగ్స్ 3.7 శాతం వాటాకు సమానమైన 7,53,74,842 షేర్లను విక్రయించనుంది. మరోవైపు గ్రే మార్కెట్లో మంచి ప్రీమియం కనిపిస్తోంది. ప్రస్తుతం ఒక్కో షేరుకు రూ. 67- 75 వరకు ఉన్నట్లు సమాచారం. ఇది దాదాపు 12-13 శాతం వరకు లిస్టింగ్ గెయిన్స్‌ను చూయిస్తోంది.