పల్లెటూర్లో ప్రజలు ముఖ్యంగా రైతులకు ఎదురయ్యే ప్రమాదాల్లో ప్రముఖమైనది పాముకాటు. మన ప్రాంతాల్లో ఉండే అత్యంత విషసర్పాల్లో రెండు, మూడు రకాలే ఎక్కువగా మనకు ఎదురవుతుంటాయి. నాగుపాము, రక్తపింజరి, కట్లపాము ఈ మూడు పాముకాట్లే మనిషి ప్రాణాలను తీస్తుంటాయి. పాము కాటు వేసిన గంటలోపే ఆస్పత్రులకు వెళ్తే ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మారుమూల గ్రామాల ప్రజలు సరైన సమయంలో ఆస్పత్రులకు వెళ్లలేక ప్రాణాలు కోల్పోతుంటారు. వారి కోసం ప్రభుత్వం ఇకపై 108లోనూ పాముకాటుకు మందును ఉంచింది. ప్రభుత్వం చేసిన ఈ కొత్త ఆలోచనతో ఎంతోమంది రైతులు, ప్రజలు సకాలంలో ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఎవరికి ఏ సమయంలో ప్రమాదం జరిగినా కొద్ది క్షణాల్లోనే 108 అక్కడ ఉంటుంది. ఈ 108లో ఎక్కువగా యాక్సిడెంట్ కేసులే వస్తుంటాయి. దానికి సంబంధించిన మందులే ఉంటాయి. అత్యవసర చికిత్స చేసేందుకు అనుకూలమైన విధంగా 108 వాహనాలను సిద్ధం చేశారు. ఇకపై అందులో పాముకాటు మందు కూడా అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. READ ALSO అనకాపల్లి జిల్లాలో పాముకాటుకు ఎక్కువ మంది గురవుతున్న కారణంతో జిల్లాలో ఉన్న 22 108 వాహనాలకు ఈ పాముకాటు మందును ప్రభుత్వం అందించింది. ఆస్పత్రిలో చేరే ముందు బాధితులకు మందు అందిస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉంది. దాని కోసం అవసరమైన మందులను ప్రభుత్వం సమకూరుస్తోంది. పాముకాటుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కించే యాంటీ స్నేక్ వేనమ్‌ ఇకపై 108 వాహనాల్లో ఉంచేందుకు ప్రభుత్వం కూడా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ టీకాలను నిల్వ చేయడానికి వాహనంలోనే ఐస్ బాక్స్‌లను కూడా ఉంచుతున్నారు. ఈ టీకాను ఎలా ఎక్కించాలి, ఏంటి అనేది కూడా సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. పాము కాటు వేసినట్లు నిర్థారణ అయితే వైద్యుడిని వీడియో కాల్‌లో సంప్రదించి, ఆయన సూచన మేరకు యాంటీ స్నేక్ వేనమ్ రోగికి ఎక్కించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ టీకా కోసం ఓ మినీ ఫ్రీజర్‌ను కూడా 108లోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.