జ్ఞానేశ్వరిని ఎవరైనా తీసుకెళ్లి ఉంటే అప్పగించండి.. ఎలాంటి చర్యలు ఉండవు.. డీఎస్పీ ప్రకటన

Wait 5 sec.

రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఘటన.. తెలుగు రాష్ట్రాలలో మిస్టరీగా మారింది. కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారానికి చెందిన జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి నెల రోజులు దాటిపోయింది. జూన్ ఆరో తేదీన పాప అదృశ్యం కాగా.. అప్పటి నుంచి పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. వివిధ కోణాలలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. పాప ఆచూకీ తెలియజేసిన వారికి లక్ష రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. కాకినాడ జిల్లా సహా చుట్టుపక్కల ప్రాంతాలలో చిన్నారి ఫోటోతో పోస్టర్లు అంటించి.. జానూ జాడ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ప్రయోజనం శూన్యం. చిన్నారి ఏమైందనేదీ అంతుపట్టని మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో డీఎస్పీ తిలక్ కీలక ప్రకటన చేశారు. మంగళవారం మధ్యాహ్నం విలేకర్ల సమావేశం నిర్వహించిన డీఎస్పీ.. జ్ఞానేశ్వరి కేసులో కీలక ప్రకటన చేశారు.చిన్నారి జ్ఞానేశ్వరిని ఎవరైనా తీసుకుని వెళ్లి ఉంటే.. పోలీసులకు అప్పగించాలని డీఎస్పీ తిలక్ కోరారు. చట్టప్రకారం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోమని డీఎస్పీ హామీ ఇచ్చారు. అయినా కూడా రావడానికి సందేహపడితే.. కనీసం పోలీసులకు సమాచారం అందించాలని.. తామే వెళ్లి చిన్నారిని తీసుకొస్తామని కోరారు. కనిపించకుండాపోయిన చిన్నారిని ఆమె తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేర్చాలనేదే తమ లక్ష్యమని అన్నారు డీఎస్పీ తిలక్. జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన రోజు నుంచి ఈ కేసును అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. చిన్నారి జంతువుల బారిన అయినా పడి ఉండాలని.. లేకుంటే ఎవరైనా ఆమెను అపహరించి ఉండాలని డీఎస్పీ అభిప్రాయపడ్డారు. చిన్నారి కుటుంబం నివసిస్తున్న తోటతో పాటుగా ఆ పక్కనే ఉన్న కొండ ప్రాంతాల్లో గాలించామని.. ఎలాంటి జంతువుల ఆనవాళ్లు లభించలేదని డీఎస్పీ తిలక్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎవరైనా ఎత్తుకెళ్లి ఉండవచ్చనే కోణంలోనే ప్రస్తుతం జ్ఞానేశ్వరి కేసును దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. సెల్ ఫోన్ వాడని వ్యక్తులు దీనికి కారణమై ఉండొచ్చనే అనుమానాన్ని డీఎస్పీ తిలక్ వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్ ఉపయోగించి ఉంటే.. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా కనిపెట్టి ఉండొచ్చనే అంచనాతో డీఎస్పీ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, వదంతులు నమ్మవద్దని డీఎస్పీ తిలక్ కోరారు.