రెండు నెలల కిందట అసెంబ్లీ ఎన్నికలు జరిగిన పుదుచ్చేరిలో రాజకీయ సమీకరణాలు ఆసక్తిరేపుతున్నాయి. పుదుచ్చేరి ఎన్నికల్లో ఎన్నార్‌ కాంగ్రెస్, కూటమి విజయం సాధించి అధికారం నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే. పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టినా.. ఇప్పటి వరకూ శాఖల కేటాయింపులు జరగలేదు. సీఎం రంగసామి అన్ని శాఖల బాధ్యతలను నిర్వహిస్తూ.. ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని తన కనుసన్నల్లోనే నడిపిస్తున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఇంకా నిర్వహించలేదు. ఇందుకు ఎన్నార్‌ కాంగ్రెస్, బీజేపీ మధ్య జరుగుతున్న వర్గపోరే ప్రధాన కారణమనే ప్రచారం జరుగుతోంది. దీంతో తీసుకోడానికి రంగసామి సిద్ధమైనట్టు తెలుస్తోంది.గత హయాంలోలానే కీలక శాఖలు, స్పీకర్ పదవి తమకే కావాలని బీజేపీ గట్టిగా పట్టుపడుతోంది. అప్పట్లో ఎన్నార్ కాంగ్రెస్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సంఖ్యా బలం లేకపోవడంతో బీజేపీ డిమాండ్లకు రంగసామి తలొగ్గారు. ఐదేళ్లూ మనస్పర్థలతోనే ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చారు. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలూ ఎవరికివారే అన్నట్టు వ్యవహరించాయి. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నార్‌ కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం చేయలేదు. తమ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి ఇండిపెండెంట్లకు బీజేపీ మద్దతు ఇచ్చిందని ఎన్నార్‌ కాంగ్రెస్‌ ఆరోపించింది.ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ సమీకరణాలు మారాయి. 10 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 4 చోట్ల మాత్రమే విజయం సాధించింది. అంటే, బీజేపీ సంఖ్యా బలం తక్కువ కావడంతో వారి డిమాండ్లకు అంగీకరించాల్సిన అవసరం లేదని సీఎం రంగసామి గట్టిగా నిర్ణయించుకున్నారని, అందుకే నిర్మొహమాటంగా నిరాకరించారని తెలుస్తోంది. పదవుల విషయమై ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని, అవి కొలిక్కి రాకపోవడంతోనే శాఖల కేటాయింపు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల నిర్వహణ కొలిక్కి రాలేదని సమాచారం.మొత్తం 30 స్థానాలు ఉన్న పుదుచ్చేరిలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం 16. ఎన్నార్ కాంగ్రెస్ 16 చోట్ల పోటీచేసి 12 స్థానాల్లో గెలవగా.. రంగసామి రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించారు. దీంతో ఆయన ఓ నియోజకవర్గంలో రాజీనామా చేశారు. అంటే, ప్రస్తుతం ఎన్నార్‌ కాంగ్రెస్‌కు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దళపతి విజయ్‌కు చెందిన కూటమికి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక అన్నాడీఎంకే, ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వాన్ని కొనసాగించాలని రంగసామి భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. డిమాండ్ల విషయంలో బీజేపీ వెనక్కి తగ్గకుంటే టీవీకేతో కూటమికి రంగం సిద్ధమవుతోందని, పుదుచ్చేరి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.