సహనం కోల్పోయిన మమతా బెనర్జీ.. టీఎంసీ కార్యకర్త చెంప చెల్లుమనిపించిన దీదీ

Wait 5 sec.

పశ్చిమ్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సహనం కోల్పోయారు. 11 ఏళ్ల చిన్నారి సామూహిక లైంగిక దాడి, హత్యను నిరసిస్తూ కోల్‌కతాలో నిర్వహించిన ర్యాలీలో టీఎంసీ కార్యకర్త చెంప చెల్లుమనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుండగా.. రాజకీయ దుమారం రేగుతోంది. ఈ వీడియోను షేర్ చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ భండారీ.. తన పార్టీ కార్యకర్తలపై పలుసార్లు చేయిచేసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మమతా బెనర్జీ మానసిక సమతౌల్యతను కోల్పోయారని ఆమె ధ్వజమెత్తారు.‘‘ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మమతా బెనర్జీ పూర్తిగా మానసిక సమతుల్యత కోల్పోయారు! ఈరోజు నిరసన ప్రదర్శనలో మమతా బెనర్జీ తన సొంత పార్టీకి చెందిన పలువురిపై దాడి చేశారు’’ అని భండారీ పోస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ మహిళా మోర్చా ఇంఛార్జ్, బీజేపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ లక్ష్మీ సింగ్ సైతం దీదీపై విమర్శలు గుప్పించారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ర్యాలీ సందర్భంగా మమతా బెనర్జీ సహనం కోల్పోయి, జనసమూహంలో ఆమెకు దారి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న ఒక టీఎంసీ కార్యకర్తను చెంపదెబ్బ కొట్టారు. మద్దతుదారులు ఆమె చుట్టూ ఉన్న జనాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తుండగా, పార్టీ అధినేత్రి పెద్ద జనసమూహం మధ్య నడుస్తూ.. తన దగ్గర నిలబడిన ఒక కార్యకర్తను కొట్టడం ఆ క్లిప్‌లో కనిపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేస్తూ లక్ష్మీ సింగ్ ‘‘టీఎంసీ నిరసన సందర్భంగా మమతా బెనర్జీ అహంకారం పూర్తిగా బయటపడింది’’అని దుయ్యబట్టారు. గుంపును చెదరగొట్టి ఆమెకు దారి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న తన సొంత పార్టీ కార్యకర్తనే ఆమె చెంపదెబ్బ కొట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది.‘‘విశ్వసనీయ కార్యకర్తలనే బహిరంగంగా ఇంత అవమానకరంగా చూస్తే, టీఎంసీ పాలనలో సామాన్య ప్రజలకు ఎంత విలువ ఉండేదో ఊహించుకోండి’’ అని ఆమె అన్నారు. నిరసనగా టీఎంసీ యువజన విభాగం నిర్వహించిన ప్రదర్శన సందర్భంగా ఈ ఘటన జరిగింది. కలకత్తా హైకోర్టు పలు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసిన తర్వాత జరిగిన ఈ ర్యాలీ.. బల్లిగంజ్ ఫారి వద్ద ప్రారంభమై దక్షిణ కోల్‌కతాలోని హజ్రా క్రాసింగ్ వద్ద ముగిసింది.ర్యాలీ అనంతరం మద్దతుదారులను ఉద్దేశించి దీదీ మాట్లాడుతూ.. నిరసన ప్రదర్శనకు అనుమతినిచ్చిన కలకత్తా హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. ‘‘మా ర్యాలీకి హైకోర్టు అనుమతిచ్చింది, కానీ బీజేపీ గూండాలు దానిని అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతినిచ్చిన కోర్టు ఉత్తర్వులను పోలీసులు ఎలా ఉల్లంఘించగలరు? బీజేపీ గూండాలు మా పార్టీ కార్యకర్తలను కొట్టారు. ఇదేనా ప్రజాస్వామ్యం?’’ అని ఆమె అన్నారు.ర్యాలీ శాంతియుతంగా కొనసాగేలా చూడటానికి బదులుగా, పోలీసులు 'బీజేపీకి తొత్తుల్లా' వ్యవహరించారని ఆమె ఆరోపించారు. ‘‘పోలీసులు సామాన్య ప్రజలకు రక్షణ కల్పించలేరు, పైగా మా కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వారిని వాడుకుంటున్నారు’’ అని బెనర్జీ అన్నారు. ఇదిలా ఉండగా, ర్యాలీ సందర్భంగా టీఎంసీ కార్యకర్తలు తమ మద్దతుదారులను రెచ్చగొట్టడం వల్లే ఘర్షణలు జరిగాయని బీజేపీ ఆరోపించింది.