వరకట్నం కోసం హత్యలు, వేధింపులు, దాడులు జరుగుతోన్న సమయంలో ఈ సామాజిక దురాచారానికి వ్యతిరేకించిన ఓ కుటుంబం అదర్శంగా నిలిచింది. తమ కుటుంబంలోకి కోడలిగా వచ్చే అమ్మాయి నుంచి ఎటువంటి కట్నకానుకలు ఆశించలేదు రాజస్థాన్‌కు చెందిన ఓ కుటుంబం. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. సికర్ జిల్లాలోని మద్నీ-మండా ప్రాంతానికి చెందిన అర్జున్‌రామ్ బురానీయా కుమారుడు సుభాష్ బురానీయాకు.. అదే ప్రాంతానికి చెందిన సరోజ్‌ అనే యువతితో వివాహం నిశ్చయమైంది. ఎటువంటి కట్నకానుకలు లేకుండా పెళ్లి జరపించాలని నిశ్చితార్థం సమయంలోనే ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించుకున్నారు.అనుకున్నట్టుగానే వరుడు కేవలం ఒక్క రూపాయి, కొబ్బరికాయను తీసుకొని సరోజ్‌ను వివాహం చేసుకున్నాడు. తమ కుటుంబంలో జరిగే పెళ్లిళ్లకు వరకట్నం తీసుకోరాదని, ఇవ్వరాదని తన తండ్రి తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ పెళ్లి జరగడంపై వరుడు ఆనందం వ్యక్తం చేశాడు. గతంలోనూ అర్జున్‌రామ్‌ కుమార్తె పింకీ బురానియా వివాహానికి కూడా కట్నం ఇవ్వలేదు. తన అల్లుడికి ఒక్క రూపాయి, కొబ్బరికాయను ఇవ్వడం గమనార్హం‘‘ఇది కేవలం కొత్త సంప్రదాయం మాత్రమే కాదు, సంవత్సరాలుగా మా కుటుంబానికి ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది’’ అని వరుడి సోదరుడు డాక్టర్ యుధ్‌వీర్ సింగ్ బురానియా అన్నారు. ఈ సంప్రదాయాన్ని తన తండ్రి బోదురామ్ బురానియా.. తన పెద్ద సోదరి డాక్టర్ సుమన్ బురానియా వివాహ సమయంలో ప్రారంభించారని ఆయన తెలిపారు. ‘‘ఆ రోజు, కుటుంబంలో భవిష్యత్తులో జరిగే ఏ వివాహాలలోనూ కట్నం ఇవ్వకూడదని, స్వీకరించకూడదని మేమంతా తీర్మానించుకున్నాం.. సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించడానికి, కేవలం ఒక రూపాయి, ఒక కొబ్బరికాయ అనే సంకేతార్థంతో వివాహాలు జరిపించాలని మేము నిర్ణయించుకున్నాం’’ అని డాక్టర్ యుధ్‌వీర్ చెప్పారు.వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ బురానియా కుటుంబం విద్యను ఎల్లప్పుడూ గొప్ప ఆస్తిగా భావిస్తారు. ఆ కుటుంబంలోని ఇద్దరు కుమార్తెలు డాక్టర్ సుమన్, డాక్టర్ ప్రియాంక వైద్య రంగంలో సేవలందిస్తుండగా.. అన్నయ్య మహేష్ కుమార్ బురానియా సశస్త్ర సీమా బల్ (SSB)లో దేశానికి సేవ చేస్తున్నారని డాక్టర్ యుధ్‌వీర్ చెప్పారు.ఓ అల్లుడు డాక్టర్ పంకజ్ నిథర్వాల్.. జైపూర్‌లోని SMS మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ‘ఈ సామాజిక దృక్పథాన్ని ప్రోత్సహించడంలో ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారు.. కుమార్తెలకు విద్యను అందించి, వారిని స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడమే గొప్ప కట్నమని మా కుటుంబం నమ్ముతుంది’’ అని ఆయన అన్నారు. కాగా, ప్రస్తుతం ఈ కుటుంబంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.