హైదరాబాద్ మహా నగరం అంతర్జాతీయ స్థాయిలో విశ్వనగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు నగరంలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. మెడికల్, ఎడ్యుకేషన్, ఐటీ హబ్‌లుగా అవతరిస్తూ నగరం తన రూపురేఖలను మార్చుకుంటోంది. అయితే, ఇదే సమయంలో నగరంలో పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్యలు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగర రవాణా వ్యవస్థను ఆధునీకరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అండర్‌పాసులు, ఫ్లైఓవర్లు, డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కొన్ని ఫ్లైఓవర్ పనులు పూర్తి కాగా, మరికొన్ని ప్రాజెక్టులు పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి.ఇందులో భాగంగా చేపట్టనున్న త్వరలోనే టెండర్లు పిలిచి, ఏడాదిలోపు పనులను ప్రారంభిస్తామని రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. అలాగే రూ.10,410 కోట్ల భారీ వ్యయంతో హైదరాబాద్ - విజయవాడ వరకు చేపట్టనున్న ఆరు వరుసల జాతీయ రహదారితో పాటు, రెండు లేన్ల సర్వీస్‌ రోడ్డు పనులకు వచ్చే నెలలో టెండర్లు పిలవనున్నట్లు ఆయన వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా తొర్రూర్‌లో రూ.338 కోట్ల వ్యయంతో ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో హ్యామ్‌ విధానంలో చేపట్టనున్న ఆధునిక నాలుగు వరుసల రహదారి పనులకు మంత్రి మంగళవారం (జులై 7) శంకుస్థాపన చేశారు.అనంతరం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా చేపట్టే గ్రీన్‌ఫీల్డ్‌ రహదారితోపాటు, దీనికి సమాంతరంగా బుల్లెట్‌ రైలు మార్గానికి సంబంధించిన డీపీఆర్‌ కూడా సిద్ధమైందని స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు మరో మూడు రహదారుల నిర్మాణానికి అదనంగా రూ.100 కోట్లతో నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. ఈ శంకుస్థాపన మహోత్సవంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.కాగా, ఉత్తర తెలంగాణ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సికింద్రాబాద్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట వైపు, అలాగే డైరీ ఫామ్ రోడ్డు వైపు ప్రతిపాదించిన రెండు భారీ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ల పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల డీపీఆర్ తుది దశకు చేరింది. మౌలిక వసతుల పనుల కోసం ప్రభుత్వం త్వరలోనే టెండర్లను ఆహ్వానించడానికి ఏర్పాట్లు చేస్తోంది.