కేటుగాళ్లు మాటు వేసి రోజుకో మారువేషంలో డబ్బులు కొట్టేస్తున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా దబాయింపుగా మాట్లాడి మరీ జేబులో డబ్బుని మనకు తెలియకుండానే దోచుకుంటున్నారు. వాళ్లు అక్కడ నుంచి వెళ్లిన తర్వాత కానీ తెలియదు మన జేబుకు చిల్లు పడిందని. ఒక్కోసారి ఒక్కోలా మోసం చేస్తూ బైక్‌పై వెళ్లే వారినే టార్గెట్ చేసి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. తెనాలి - మంగళగిరి రూట్‌లో సమీపంలోనే ఈ తరహా సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అందుకే ఈ రూట్‌లో వెళ్లేవారు తస్మాత్ జాగ్రత్త!దుగ్గిరాల అలీనగర్‌కు చెందిన ఫరూక్ అనే వ్యక్తి రైలు పేటలో టెంట్ హౌస్ నడుపుతుంటాడు. ఈ క్రమంలో రోజులాగానే తెనాలి - మంగళగిరి మెయిన్ రోడ్డులో సినిమా హాలు వైపు నుంచి వస్తూ తన ఇంటికి వెళ్తున్నాడు. సరిగ్గా జెండా చెట్టు వద్ద కొత్తగా నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ వద్దకు రాగానే తెనాలి నుంచి బైక్‌పై ఇద్దరు యువకులు వచ్చారు. ఆ ఇద్దరూ కూడా 25 ఏళ్ల వయస్సు వారే. ఫరూక్ బండి ఆపిన ఆ ఇద్దరు యువకులు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నావా, చూడాలి అంటూ చెక్ చేశారు. అతని జేబులో రూ. 7 వేల నగదు ఉండటంతో వాటిని తీసుకున్నారు. మొత్తం ఫుల్‌గా చెక్ చేసిన తర్వాత ఆ డబ్బును ఫరూక్ జేబులో పెడుతున్నట్టు నటించి న్యాక్‌గా రూ. 200, రూ. 100 నోట్లు మాత్రమే పెట్టి ఇక వెళ్లిపో అంటూ ఆర్డర్ వేసినట్లు చెప్పారు. READ ALSO ఆ ఇద్దరు యువకులు మంగళగిరి వైపు వెళ్లగానే. ఫరూక్ జేబులో డబ్బులో చూసుకోగా మొత్తం రూ. 7 వేల నగదు కనిపించలేదు. దాంతో అతడు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి విషయం చెప్పాడు. గతంలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనలే రెండు జరిగాయి. ఈ రెండూ కూడా ఇప్పుడు ఫరూక్‌ సంఘటనలతో పోల్చి ఉండటంతో పక్కా ప్లాన్‌తోనే ఎవరో ఇలా చేస్తున్నారన్న అనుమానాలు మొదలయ్యాయి. గత నెలలో ఓ రైతు స్కూటీపై వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు దుగ్గిరాల - మోరంపూడి మధ్య.. బండి చక్రం వద్ద వద్ద బోల్టులు ఊడిపోతున్నాయి చూసుకోరేంటి అంటూ ఆ రైతును ఆపారు. నిజమే కదా అని ఆ రైతు బండి ఆపి చూసుకుంటుండగా అతని జేబులోని మొబైల్ లాక్కొని పరారయ్యారు. ఆరు నెలల కిందట కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తిని చింతలపూడి - దుగ్గిరాల మధ్య ఇద్దరు యువకులు ఆపి గంజాయి పేరుతో తనిఖీ చేసి రూ. 3500 తీసుకెళ్లారు. దాంతో ఈ రూట్‌లో మాటు వేసి మరీ దొంగతనాలకు పాల్పడుతున్న ఆ ఇద్దరు యువకుల కోసం నిఘా పెడుతున్నామని పోలీసులు తెలిపారు.