పేద విద్యార్థులకు నిజంగా ఇది గుడ్‌న్యూసే. ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి సహకరించక గొప్ప విద్యాసంస్థల్లో, సీబీఎస్‌ఈ సిలబస్‌లో చదవలేకపోతున్న విద్యార్థులకు అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఆరో తరగతి నుంచి ప్లస్ టూ (ఇంటర్) వరకు ఉచితంగా నాణ్యమైన విద్యను అభ్యసించేలా కేంద్ర ప్రభుత్వం ఈ సదుపాయాన్ని అందిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కాగజ్‌నగర్‌లోని త్రిశూల్‌పహాడ్‌ జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి గానూ ఆరో తరగతిలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 80 సీట్లలో విద్యార్థులను చేర్చుకోవడానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు జులై 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నవంబర్‌ 28న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు.ఈ ప్రవేశ పరీక్షలో సీటు సాధించిన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పూర్తి ఉచిత విద్యాబోధనతో పాటు ఉచిత వసతి లభిస్తుంది. ఇది కో-ఎడ్యుకేషన్ పాఠశాల అయినందున బాలబాలికలకు ప్రత్యేకంగా సురక్షితమైన వసతి సౌకర్యాలు కల్పించారు. ఇక్కడ విద్యతో పాటు క్రీడలు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, నూతన సాంకేతిక అంశాలను జోడించి ఆధునిక పద్ధతుల్లో విద్యను భోదిస్తారు. కాగా, ఈ పాఠశాలలో ప్రవేశానికి విద్యార్థులు కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. అర్హతలు ఇవే..ప్రస్తుత 2026-27 విద్యాసంవత్సరంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతూ ఉండాలి.అలాగే మూడు, నాలుగు తరగతులు కూడా ఇదే ఉమ్మడి జిల్లాలోనే చదివి ఉండాలి.విద్యార్థుల వయస్సు విషయానికి వస్తే 01-05-2015 నుంచి 31-07-2017 మధ్య కాలంలో జన్మించి ఉండాలి.గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు పెద్దపీట వేస్తూ నవోదయ విద్యాలయాల్లో మొత్తం 80 సీట్లకు గానూ 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదువుతున్న వారికే కేటాయిస్తారు. మిగిలిన సీట్లలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. అలాగే బాలికల విద్యాభివృద్ధిని ప్రోత్సహించేలా మొత్తం సీట్లలో మూడో వంతు (1/3) సీట్లను కేటాయించారు. ఇక్కడ కేవలం చదువుకే పరిమితం కాకుండా విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా చిత్రలేఖనం, సంగీతం, యోగా, కరాటే వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. చిన్నతనం నుంచే క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం అలవాటు పడేలా స్కౌట్స్, ఎన్‌సీసీ నిర్వహిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారు. భవిష్యత్తులో విద్యార్థులు ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ వంటి ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంవత్సరాల్లో ప్రవేశాలు పొందేలా ప్రత్యేకంగా సన్నద్ధం చేస్తారు.విద్యార్థుల ఉజ్వల భవితకు ఇదొక చక్కని అవకాశమని పాఠశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ కొడాలి పార్వతి తెలిపారు. నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతితో పాటు అన్ని రకాల ఉత్తమ సదుపాయాలను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు గడువు ముగిసేలోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి తమ పిల్లలను ప్రవేశపరీక్షకు సిద్ధం చేయాలని కోరారు.