తమిళనాడు ఎముఖ్యమంత్రి విజయ్‌‌పై మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపును సవాల్ చేస్తూ డీఎంకే అభ్యర్థి ఇనిగో ఇరుదయరాజ్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. విజయ్ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్‌లో పెండింగ్ కేసుల వివరాలు దాచారని, ఎన్నికల ఖర్చులను పూర్తిగా చూపలేదని కోర్టును ఆశ్రయించారు. చట్ట విరుద్ధంగా చిన్నపిల్లల్ని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకున్నారని పిటిషన్‌లో ప్రస్తావించారు. విజయ్ విజయాన్ని రద్దు చేసి తనను విజేతగా ప్రకటించాలని కోరారు. విజయ్ పోటీచేసి రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గ ఉపఎన్నికపై స్టే విధించాలని హైకోర్టును కోరారు. అలాగే విల్లివాక్కం నియోజకవర్గం నుంచి తమిళనాడు మంత్రి ఆదవ్ అర్జునపై విజయాన్ని సవాల్ చేస్తూ మరో పిటిషన్ దాఖలైంది.మద్రాసు హైకోర్టు జస్టిస్ వీ లక్ష్మీనారాయణన్ ఏకసభ్య ధర్మాసనం.. సీఎం విజయ్‌, విజయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. వారం రోజుల్లోగా హైకోర్టులో దాఖలైన ఈ పిటిషన్లలో ఉన్న కొన్ని సాంకేతిక లోపాలను సరిదిద్దాలని పిటిషనర్లను న్యాయమూర్తి ఆదేశించారు. పిటిషన్లకు సంబంధించిన సాంకేతిక ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత సీఎం విజయ్, మంత్రి ఆదవ్ అర్జునకు 3 వారాల గడువిస్తూ నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఎన్నికల పిటిషన్లు కాబట్టి ఈ విచారణను అత్యంత వేగంగా.. ఆరు నెలలలోపే పూర్తి చేయాలన్నారు.మరోవైపు . ఈ నెల 10న కరూర్ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని ప్రతిపక్ష డీఎంకే వేసిన పిటిషన్‌పై విచారణ జరగ్గా.. జస్టిస్ కె. వి. విశ్వనాథన్, జస్టిస్ అలోక్‌లతో కూడిన ధర్మాసనం డీఎంకే తీరుపై ఘాటుగా స్పందించింది. దేశ ప్రజలకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. అలాంటి స్వేచ్ఛపై ఆంక్షలు విధించాలా అని ప్రశ్నించింది. తాము ముఖ్యమంత్రి పర్యటనల్ని నియంత్రించాలా అంటూ ప్రశ్నించారు. సీఎం కరూర్ తొక్కిసలాట బాధితులతో మాట్లాడుకుండా, బహిరంగ ప్రకటన చేయకుండా నిరోధించాలనడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. సుప్రీం కోర్టును రాజకీయ వేదికగా మార్చొద్దని.. సుప్రీం కోర్టు పిటిషన్‌ను కొట్టేసింది.