రోజులు మారిపోయాయి.. ఒకప్పుడు మన ఇంటిలోనే ఆరోగ్యం ఉండేది. ఏది కావాలన్న మన పెరట్లో దొరికేది. కానీ ఉరుకుల పరుగుల జీవితం, మారిన లైఫ్ స్టయిల్‌లో అన్నీ బయట నుంచే కొనాల్సి వస్తోంది. ఆ బయట ఉండేవి అన్నీ రసాయనాలే.. తినే తిండి నుంచి తాగే నీరు వరకూ అంతా కలుషితమే. ఇలాంటి కలుషిత సొసైటీలో కూడా సంతపెట్టి మరీ సేఫ్ ఫుడ్‌ని అందిస్తున్నారు మన వైజాగ్ ప్రజలు. గాజువాక సేంద్రీయ సంత ఆరోగ్యాన్ని పెంచే కూరగాయలకు ఆదరణగా నిలుస్తోంది. ప్రజల్లో కూడా ఇప్పుడు చైతన్యం వచ్చింది. ఒకప్పుడు ఏదైతే ఏముందిలే అనేవాళ్లు, కానీ ఇప్పుడు సేంద్రియ వ్యవసాయంలో పండించింది అంటే కాస్త డబ్బులు ఎక్కువైనా కొనడానికి వెనకాడటం లేదు. నాలుగు డబ్బులు పోయినా.. నాలుగు రోజులు ఎక్కువ బతుకతామని ఆర్గానిక్ ఉత్పత్తులనే కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. గాజువాకలోని మిద్దె, పెరటితోటల పెంపకందారులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. గాజువాక వుడా ఓపెన్ ఆడిటోరియం ఆవరణలో ఆర్గానిక్ సంత ఏర్పాటు చేశారు. ప్రతి గురువారం సంత ఏర్పాటు చేసి, ఆర్గానిక్ పద్ధతిలో పెంచిన కూరగాయలు, ఆకుకూరలను ఇక్కడ అమ్ముతుంటారు. గాజువాక నేచర్ గార్డెనర్స్ సంస్థ మహిళా సభ్యులు ఆధ్వర్యంలో ఈ సంత జరుగుతుంది. ఈ సంత కోసం వారం రోజులుగా ఎదురుచూసే వాళ్లు కూడా ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆరోగ్యం సంతలోనే మన చెంతకు వస్తుంది కాబట్టి. ఈ ఆర్గానిక్ సంతకు శ్రీకారం చుట్టిన నేచర్ గార్డెన్ర్స్ సంస్థ వ్యవస్థాపకురాలు మాచవరపు ఐశ్వర్యకు అభినందనల వెల్లువెత్తింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఈ సంతను ఏర్పాటు చేయగా.. అప్పుడే మంచి గుర్తింపు వచ్చింది. 22 మంది వరకు రైతులు ప్రతి వారం ఈ సంతకు వచ్చి తమ ఉత్పత్తులను అమ్ముతుంటారు. ఇక్కడ కేవలం ఆర్గానిక్ కూరగాయలు, ఆకుకూరలే కాకుండా.. ప్రకృతి మేలు చేసే సంచులు కూడా ఇక్కడ ఉంటాయి. ఆ సంచులను ఉచితంగా పంపిణీ చేస్తూ ప్రజల్లో అవగాహన కూడా తీసుకొస్తున్నారు. ప్రతి గురువారం నిర్వహించే ఈ సంతలో ఆకుకూరలు, కూరగాయలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పండించిన బెల్లం, గానుగ నూనె, ప్రకృతి వ్యవసాయంతో పండించిన పప్పు ధాన్యాలు కూడా అమ్ముతున్నారు. వాటితో పాటు హెల్దీ డ్రింక్స్, అప్పడాలు, పచ్చళ్లు ఇలా ఆర్గానిక్‌గా పండించే ప్రతీదీ ఈ సంతలోనే దొరుకుతుంది. ఆర్గానిక్ అనడంతో రైతులు తీసుకొచ్చిన ఉత్పత్తులు కాసేపట్లోనే అమ్ముడవుతున్నాయి. డిమాండ్ పెరగడంతో మరింత మంది ఆర్గానిక్ పంటలు వేయాలని చూస్తున్నారు.