జనసేన పార్టీలో తాజాగా మరోసారి చేరికలు జరిగాయి. విజయవాడకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త జనసేన పార్టీలో చేరారు. గుడిపాటి సీతారామ్ సతీమణి యువ గాయని శ్రీలలిత.. ఇటీవల ఆమెను ప్రధాని మోదీ కూడా ప్రశంసించిన సంగతి తెలిసిందే. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను గుడిపాటి సీతారామ్ కలిశారు. తాను జనసేన పార్టీలో చేరతానని సీతారామ్ కోరగా.. సాదరంగా ఆహ్వానించారు. నేషన్ ఫస్ట్ అనే దృక్పథం కలిగిన నేతని.. ఆయన నాయకత్వంలో అడుగులు వేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీలో చేరానని సీతారామ్ తెలిపారు. జనసేన పార్టీ సిద్ధాంతాలకు, పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణం పనిచేస్తానన్నారు సీతారామ్.గుడిపాటి సీతారామ్ యువతలో క్రీడలను ప్రోత్సహించడానికి 'గుడిపాటి ఫౌండేషన్' ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలను కూడా నిర్వహించారు. గుడిపాటి ఫౌండేషన్ ద్వారా విజయవాడ, పరిసర ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు, కార్మికులకు నిత్యావసర వస్తువులు, సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అలాగే ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తుంటారు. వారికి అవసరమైన ఫీజులు, పుస్తకాల పంపిణీ వంటివి అందజేస్తుంటారు. అలాగే పేదల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహణ.. ఉచితంగా మందులు పంపిణీ చేయడం వంటి పనులను ఫౌండేషన్ ద్వారా చేశారు.సింగర్ శ్రీలలిత పాడిన ‘కనకదుర్గా మహా ప్రమావిత’ పాట యూట్యూబ్ లింక్‌ను ప్రధాని మోదీ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విజయవాడకు చెందిన గాయని శ్రీలలిత కనకదుర్గమ్మపై ఈ పాటను చక్కగా పాడారు.. ప్రధాని మెచ్చి లింక్‌ను పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఆ దుర్గమ్మను ఆరాధిస్తే మనసు అపారమైన శక్తిసామర్థ్యాలతో నిండిపోతుందన్నారు ప్రధాని. శ్రీలలితది విజయవాడలోని సత్యనారాయణపురం. శ్రీలలిత ఎన్నో టీవీ షోలు చేశారు.. 2019 నుంచి ప్రతి దసరాకు విజయవాడ దుర్గమ్మపై పాటలు విడుదల చేస్తున్నారు. అమ్మవారిపై ఇప్పటి వరకు 70 పాటలు పాడారు.. ఆమె కాంతారా సినిమాలోని వారాహ రూపం పాటకు కవర్ సాంగ్ చేయగా యూట్యూబ్‌లో అందర్ని ఆకట్టుకుంది. శ్రీలలిత ప్రస్తుతం ఎంఏ మ్యూజిక్ చేస్తున్నారు.. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి టీమ్‌లో ఉన్నారు. భావి తరాలకు ఆదిశంకరాచార్యుల రచనలను పాటల రూపంలో అందించాలని లక్ష్యం పెట్టుకున్నారు. తన భర్త సీతారామ్‌ సహకారంతో భగవద్గీతలోని సారాంశాన్ని పాటలుగా మార్చి, ఏఐ టెక్నాలజీ ద్వారా విజువల్స్‌ కలిపి అందించాలని భావిస్తున్నారు. అంతేకాదు ఆయా రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలతో ఒక మ్యూజిక్ బ్రాండ్ ట్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నారు. శ్రీలలిత నారిగమ పేరుతో ఇటీవల లాంచ్ చేశారు. ఆమె భర్త సీతారామ్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త.