తెలంగాణలో వర్షాలు.. వాతావరణశాఖ కీలక అప్డేట్

Wait 5 sec.

తెలంగాణలో వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో రానున్న వారం రోజుల పాటు వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయన్నారరు. నేటి నుంచి జూలై 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా వానలు, ఈదురుగాలులు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రజలు ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.తొలి రెండు రోజుల్లో వాతావరణ ప్రభావం అత్యధికంగా ఉండనుంది. నేడు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వర్షాలు సైతం కురుస్తాయన్నారు. ఈ జిల్లాల్లో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. మిగిలిన జిల్లాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో సాధారణం కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఉపరితల ఆవర్తనం, గాలి తుఫానుల ప్రభావం కారణంగా ఈ ఈదురుగాలులు సంభవిస్తున్నాయన్నారు. జూలై 13 వరకు ఎక్కువ రోజులు రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు స్థిరంగా వీస్తూనే ఉంటాయన్నారు. బలమైన గాలుల కారణంగా పాత ఇళ్లు, తాత్కాలిక షెడ్లు, విద్యుత్ స్తంభాలు, చెట్ల కొమ్మలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందువల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు పిడుగుపాట్లు, బలమైన గాలుల సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.మరోవైపు.. ఈ ఏడాది ఎల్‌నినో ప్రతికూల ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షపాత సరళి పూర్తిగా దెబ్బతిన్నది. సాధారణంగా ప్రతి సంవత్సరం మే చివరి వారంలోనే నైరుతి రుతుపవనాలు తెలంగాణను పలకరిస్తాయి. కానీ ఈసారి రుతుపవనాల గమనం నెమ్మదించడంతో జూన్ రెండో వారంలో కానీ ఇవి రాష్ట్రంలోకి ప్రవేశించలేదు. రుతుపవనాలు ఆలస్యంగా రావడం, వచ్చిన తర్వాత కూడా ఆశించిన స్థాయిలో విస్తరించకపోవడంతో చాలా జిల్లాల్లో తీవ్రమైన లోటు వర్షపాతం నమోదైంది. పత్తి, మక్కజొన్న, వరి వంటి ఖరీఫ్ పంటల సాగు కోసం విత్తనాలు వేసిన రైతులు ప్రస్తుతం ఆకాశం వైపు చూస్తున్నారు. రానున్న ఈ వారం రోజుల వర్షాలైనా లోటును పూడ్చి, పంటలకు జీవం పోస్తాయని రైతాంగం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.