తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. స్వామిని దర్శించుకుని తిరిగి సొంత ఊర్లకు వెళ్లిపోతుంటారు. కొందరు భక్తులు హడావిడిలో వారి విలువైన వస్తువుల్ని పోగొట్టుకుంటున్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ భక్తుడు తిరుమలలోని వసతి గదిలో బంగారం మర్చిపోయి వెళ్లారు.. . తాజాగా తెలంగాణకు చెందిన మరో భక్తుడు బంగారం, డబ్బులు ఉన్న బ్యాగ్ పోగొట్టుకోగా టీటీడీ అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగి వెంటనే గుర్తించి తిరిగి అప్పగించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన తెలంగాణ భక్తుడు పోగొట్టుకున్న విలువైన బ్యాగ్‌ను టీటీడీ కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి గుర్తించారు. ఆ బ్యాగులో ఉన్న డబ్బులు, బంగారం, వెండి ఆభరణాలు, మొబైల్ ఫోన్‌తో పాటు ఇతర విలువైన వస్తువులను తిరిగి భక్తుడికి జాగ్రత్తగా అప్పగించారు. తెలంగాణకు చెందిన రామకృష్ణ కుటుంబ సభ్యులు మేదరమిట్ట నుంచి గోగర్భ డ్యాం సమీపంలోని మఠాలకు మహేంద్ర టాక్సీ జీప్‌లో ప్రయాణించారు. ఆ సమయంలో తమ బ్యాగ్‌ను వాహనంలోనే మరిచిపోయారు.. వెంటనే రామకృష్ణ ఈ విషయాన్ని గుర్తించి టీటీడీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఫిర్యాదు చేశారు. అధికారులు వెంటనే సీసీటీవీ ప్లేబ్యాక్ ఫుటేజీలను పరిశీలించారు.. భక్తుడు ప్రయాణించిన జీప్‌ను గుర్తించారు. అప్పటికే తిరుపతికి చేరుకున్న డ్రైవర్‌ను సంప్రదించి బ్యాగ్‌ను జాగ్రత్తగా స్వాధీనం చేసుకున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భక్తుల సమక్షంలో బ్యాగ్‌ను తెరిచి అందులోని విలువైన వస్తువులను ధృవీకరించి యథాతథంగా అప్పగించారు. భక్తుడి బ్యాగులో రూ.23,000 డబ్బులు, 4 గ్రాముల బంగారు ఉంగరం, 12 గ్రాముల బంగారు గొలుసు, 15 గ్రాముల వెండి కాళ్ల పట్టీలు, ఒప్పో మొబైల్, సుమారు రూ.1.20 లక్షల విలువైన ఓ దంత పరికరం ఉంది. బ్యాగును జాగ్రత్తగా తిరిగి తమకు అప్పగించినందుకు భక్తుడు రామకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. టీటీడీ కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు, విజిలెన్స్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టీటీడీ భద్రతా వ్యవస్థ బావుందన్నారు. అలాగే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. టీటీడీకి విరాళాలుటీటీడీకి చెందిన వివిధ పథకాలకు సోమవారం రూ.41 లక్షలు విరాళంగా అందింది. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ లయన్ సాయి వెంకట్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర సర్వ శ్రేయాస్ ట్రస్ట్ కు స్వర్ణ విహార్ ఇన్ ఫ్రా ప్రాజెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తరఫున రూ.10 లక్షలు, జయహో రామానుజ సినిమా ఆగస్టు 15న విడుదల సందర్భంగా మరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు. గుంటూరుకు చెందిన భక్తురాలు జి లావణ్య శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.11,11,111 విరాళంగా అందించారు. రాజమహేంద్రవరానికి చెందిన పాటంశెట్టి సాయి ఫణీంద్ర శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాద ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతలు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.