ప్రముఖ బిలియనీర్ పంకజ్ ఓస్వాల్ పెద్ద కుమార్తె, భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త స్విట్జర్లాండ్‌లో జాతివివక్షతను ఎదుర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆమె సోషల్ మీడియాల పంచుకున్నారు. గత ఎనిమిదేళ్లుగా అక్కడ నివసిస్తున్న ఆమె. గురువారం మధ్యాహ్నం కుటుంబసభ్యులతో కలిసి లాన్ మోవర్ (గడ్డి కత్తిరించే యంత్రం) వాడుతుండగా, వారి పక్కింటిలో ఉండే ఓ స్విస్ వృద్ధుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ‘ఇది ‘ఇండియా కాదు’ అంటూ దురుసుగా ప్రవర్తించిన దృశ్యాలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన వీడియోలో ఉన్నాయి. ఆ సమయంలో లాన్ మోవర్ వాడకూడదనే చట్టమేదీ లేదని వసుంధర అతడికి స్పష్టం చేశారు.ఆ వ్యక్తి పదే పదే జాత్యహంకార వ్యాఖ్యలు చేయడంతో, ఓస్వాల్ కుటుంబం అతడిని తమ ప్రాంగణం నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరింది. అంతకుముందు మరో పొరుగు వ్యక్తి కూడా లాన్ మోవర్ ఉపయోగించాడని, కానీ అతడ్ని ఏమీ అనలేదని తమ తోటమాలి చెప్పినట్లు వసుంధర పేర్కొన్నారు. ఈ వీడియోతో పాటు స్విట్జర్లాండ్‌లో విస్తృతంగా ఉన్న జాతి వివక్ష, విదేశీయుల పట్ల ద్వేషం గురించి ఆమె ఒక సుదీర్ఘమైన నోట్‌ను రాశారు. గణాంకాలను వివరిస్తూ... ఆ దేశంలో నివసిస్తున్న వారిలో 17% మంది జాతివివక్షతను ఎదుర్కొన్నట్లు నివేదించారని ఆమె తెలిపారు. బ్రిటన్ వంటి దేశాలతో పోలిస్తే స్విట్జర్లాండ్‌లో ఇటువంటి సంఘటనలపై కేసు నమోదు చేసే వ్యవస్థ చాలా బలహీనంగా ఉందని, అందుకే ఇక్కడి సమస్యలు బయటకు రావడం లేదని ఆమె వాదించారు.ఆర్థికాభివృద్ధి జరిగినంత మాత్రాన సామాజిక ప్రగతి సాధించినట్లు కాదని ఓస్వాల్ స్పష్టం చేశారు. ఇన్నేళ్లుగా తాను స్విట్జర్లాండ్‌లో ఉంటున్నా ఇటువంటి వివక్ష ఎదురుకావడం పట్ల ఆమె తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ‘గత ఎనిమిదేళ్లుగా స్విట్జర్లాండ్‌లో నివసిస్తూ, ఆ దేశంలోనే అతిపెద్ద నివాసాల్లో ఒకదానిని నిర్మించుకున్న భారతీయులుగా.. స్విట్జర్లాండ్‌లో జాతి వివక్ష, విదేశీయులపై ద్వేషం చాలా ఎక్కువగా ఉన్నాయని, కానీ దీని గురించి ఎవరూ మాట్లాడటం లేదని చెప్పడానికి మేము విచారిస్తున్నాం... ముఖ్యంగా సగటు స్థానిక జనాభా కంటే మెరుగైన స్థితిలో ఉంటూ, భిన్నమైన చర్మ రంగు కలిగిన వారిని లక్ష్యంగా చేసుకుని ఇలా చేస్తున్నారు’’ అని ఆమె రాసుకొచ్చారు.పర్యాటకం, విద్య లేదా శాశ్వత నివాసం కోసం స్విట్జర్లాండ్‌ను ఎంచుకునేటప్పుడు భారతీయులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. భారతీయులను, వారి సంస్కృతిని తక్కువగా చూసే ప్రాంతాలకు తమ కష్టార్జితాన్ని ఆర్థికంగా అందించాలా? వద్దా? అని ఆలోచించుకోవాలని సూచించారు.‘‘స్విట్జర్లాండ్‌లో మేము ఎదుర్కొంటున్న విదేశీయలుపై ద్వేషాన్ని బయటపెడుతున్నాను.. తద్వారా ఈ దేశాన్ని మీరు సందర్శించడానికి, చదువుకోవడానికి లేదా స్థిరపడటానికి ఏదైనా దేశాన్ని ఎంచుకునేటప్పుడు.. స్థానికులు భారత్‌ను, భారతీయ సంస్కృతిని, భారతీయులను తక్కువగా చూస్తున్నప్పుడు, ఆ దేశం పర్యాటకం లేదా ఇతర ఆర్థిక రూపాల్లో భారతీయుల కష్టార్జితాన్ని పొందేందుకు నిజంగా అర్హమైనదేనా అనేది మీరు అర్థం చేసుకోవచ్చు’’అని వసుంధర ఓస్వాల్ తన పోస్ట్ ముగించారు.ఎవరీ వసుంధర ఓస్వాల్?ఓస్వాల్ గ్రూప్ గ్లోబల్ వ్యవస్థాపకులు పంకజ్, రాధికా ఓస్వాల్‌ల కుమార్తె వసుంధర ఓస్వాల్. ఈ బహుళజాతి వ్యాపార సంస్థ ఎరువులు, పెట్రోకెమికల్స్, ఇతర రంగాలలో విస్తరించింది. ఆమె స్విట్జర్లాండ్‌లోని ఓ ప్రముఖ యూనివర్సిటీ నుంచి ఫైనాన్స్‌లో డిగ్రీని పొందారు. 'ది ఎకనామిక్ టైమ్స్' ఇన్స్‌పైరింగ్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్, 2023లో గ్లోబల్ యూత్ ఐకాన్ సహా పలు అవార్దులను వసుంధర దక్కించుకున్నారు.‘ఫెమినా ఇండియా’లో కూడా ఫీచర్ అయ్యారు. తన కుటుంబంతో కలిసి వసుంధర స్విట్జర్లాండ్‌లో 'విల్లా వారి' అనే లగ్జరీ నివాసంలో ఉంటున్నారు. మాంట్ బ్లాంక్ పర్వతాల అభిముఖంగా ఉన్న ఈ ఇల్లు ఆ దేశంలోనే అత్యంత ఖరీదైన బంగ్లాల్లో ఒకటిగా ప్రచారంలో ఉంది. ఈ ఇంటిని ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ జెఫ్రీ విల్కేస్ డిజైన్ చేశారు.