తెలంగాణ మంత్రికి చంద్రబాబు, లోకేష్ విషెస్.. కాంగ్రెస్‌లో ఉన్నా సరే ఎంతో గౌరవం

Wait 5 sec.

రాజకీయాల్లో చాలామంది పార్టీలు మారుతుంటారు.. అలా కండువా మార్చగానే అప్పటి వరకు పనిచేసిన పార్టీలపై విమర్శలు చేసిన సందర్భాలు చాలానే చూశాం. వీరిలో ఫంక్షన్లు, కార్యక్రమాలకు హాజరైన సమయంలో ఎదురుపడినా పలకరించుకోని నేతలు ఉన్నారు. కొందరు మాత్రం అలా కాకుండా పార్టీ మారినా సరే.. గతంలో పనిచేసిన పార్టీల అధినేతలు, ముఖ్య నేతల విషయంలో మర్యాదగా వ్యవహరిస్తుంటారు.. అప్పుడప్పుడు కలుస్తుంటారు, బాగోగుల గురించి మాట్లాడుకుంటూ బర్త్ డే రోజు విషెస్ వంటివి కూడా చెప్పుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో అలాంటి నేతలు చాలామందే ఉన్నారు.. వారిలో కూడా ఒకరు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినా సరే.. టీడీపీ అధినేత చంద్రబాబు పట్ల అభిమానంతో ఉంటారు.. చంద్రబాబు కూడా సీతక్కకు ఆ గౌరవాన్ని ఇస్తుంటారు.ఇవాళ మంత్రి సీతక్క పుట్టిన రోజు కావడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. 'తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో మీరు మరిన్ని విజయాలు సాధిస్తూ, ఆయురారోగ్యాలతో ఉండాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను' అంటూ చంద్రబాబు విషెస్ తెలిపారు. మంత్రి లోకేష్ కూడా సీతక్కకు విషెస్ తెలిపారు. 'తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి ధనసరి సీతక్క గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన ఆమె జీవిత ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. ప్రజాసంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేస్తున్న సీతక్క గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశారు.సీతక్క పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఏటా చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పార్టీలు, రాష్ట్రాలు వేరైనా చంద్రబాబు, సీతక్కలు గౌరవ భావంతో ఉంటారు. చంద్రబాబును తన రాజకీయ గురువుగా భావిస్తానని సీతక్క చెబుతుంటారు.. టీడీపీనే రాజకీయంగా జన్మనిచ్చిందని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే ఇప్పటికీ చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్నాయంటున్నారు. అంతేకాదు సీతక్క రాఖీ పౌర్ణమి సందర్భంగా చంద్రబాబును కలిసి రాఖీ కట్టేవారు. ఎవరు ఏమనుకున్నా సరే తాను పట్టించుకోనన్నారు. సీతక్క అసలు పేరు ధనసరి అనసూయ కాగా.. సీతక్కగా పిలుస్తుంటారు. వరంగల్ జిల్లా ఏటూరునాగరంలో చదువుకున్నారు.. చిన్నవయసులోనే 1987లో తుపాకీ చేతపట్టి జనశక్తి గ్రూపులో చేరారు. ఏడేళ్ల తర్వాత సీతక్క జనశక్తి నుంచి బయటకు వచ్చారు.. 1994లో ప్రభుత్వం పిలుపుతో లొంగిపోయారు. అనంతరం సీతక్క దూరవిద్య ద్వారా చదువును కొనసాగించారు.. 2003లో చంద్రబాబు పిలుపుతో టీడీపీలో చేరారు. సీతక్క 2004లో ములుగు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు.. 2009లో తిరిగి ములుగు నుంచి పోటీచేసి విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014లో జరిగిన ఎన్నికల్లో ములుగు నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి.. దీంతో ఆమె 2017లో రేవంత్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో ములుగు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు.. అనంతరం 2023లో జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలిచి రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రి అయ్యారు. సీతక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే చంద్రబాబు పట్ల అభిమానంతో ఉంటారు.. చంద్రబాబు కూడా సీతక్క విషయంలో గౌరవ భావంతో ఉంటారు.